
పోలింగ్ తేదీలు సమీపిస్తుంటే ప్రచార హోరు, ఎన్నికల వేడి పెరుగుతున్న అయిదు చోట్ల గెలుపోటములపై అంచనాలు ఆసక్తిని రేపుతున్నాయి. అసోం, కేరళ, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)లలో పోలింగ్ ఈ నెల 9న జరుగనుండగా తమిళనాడులో ఈ నెల 23న, పశ్చిమబెంగాల్‌లో ఈ నెల 23, 29 (రెండు విడతల) తేదీల్లో పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన పరిస్థితిలో.. అయిదుగురు ప్రస్తుత ముఖ్యమంత్రులు తమ పార్టీలను/కూటములను తిరిగి గట్టెక్కించినా ఆశ్చర్యం లేదనే అంచనాలు కూడా సాగుతున్నాయి. అసోంలో బిజెపి మూడో సారి గెలిచే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. హిమంత బిశ్వశర్మ ఇక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెద్దపోరు తర్వాత కూడా పశ్చిమబెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగోసారి గెలిచే సంకేతాలున్నాయి.
తమిళనాడులో సినీనటుడు విజయ్ రంగప్రవేశంతో రాజకీయం కొంత రంగుమారినా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రధాన భాగస్వామిగా ‘ఇండియా కూటమి’ అధికారం నిలబెట్టుకోవచ్చనే అంచనాలు సాగుతున్నాయి. ఇక పుదుచ్చేరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్.ఆర్. కాంగ్రెస్, -బిజెపి ప్రధాన భాగస్వాములుగా ఎన్‌డిఎ కూటమియే మళ్లీ గెలవటం ఖాయంగా కనిపిస్తోంది. కేరళంలో ఎన్‌డిఎ మూడో కూటమిగానే నిలిచిపోయి, పోటీ ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) మధ్య నువ్వా, నేనా అన్నట్టుంది. ఎన్నికల ప్రకటనకు ముందువరకు యుడిఎఫ్ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపించినా, పాలక ఎల్‌డిఎఫ్ క్రమంగా పుంజుకుంటుండటంతో ఈ పోటీ రసవత్తరంగా తయారయింది.
అసోం ఎన్‌డిఎ పక్షాల్లో ఐక్యత, ఓటు బదిలీకి అనుకూలించేలా సీట్ల పంపకపు ప్రక్రియ చేపట్టడం వారికి కలిసివస్తోంది. అభివృద్ధి, సంక్షేమం కలగలిపి తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో కూడా వారికి అనుకూలించేదిగా ఉంది. బిజెపి ఇక్కడి ఎజిపి, బిపిఎఫ్ పార్టీలతో కలిసి సయోధ్యతో కూటమి రాజకీయం నెరపుతోంది. కాంగ్రెస్ కేంద్రకంగా ప్రతిపక్ష కూటమి కడదాకా అంతర్గత కలహాలతోనే నలుగుతోంది. 126 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్‌డిఎ కూటమి 90 స్థానాలు కైవసం చేసుకునే అవకాశమున్నట్టు ‘పీపుల్స్‌పల్స్’ ట్రాకర్ పోల్ సర్వే (2)లో వెల్లడయింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నది ఎన్‌డిఎ (డబుల్ ఇంజన్) ప్రభుత్వమే అయినా ప్రజల్లో అంతగా వ్యతిరేకత, ప్రభుత్వాన్ని మార్చాలన్న నిశ్చయం కనిపించడం లేదు. నాయకత్వం ప్రజాదరణ కూడా వారికే అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో 40శాతం మంది ప్రస్తుత సిఎం హిమంత బిశ్వశర్మనే తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ గౌరవ్ గొగోయ్‌ను ముఖ్యమంత్రిగా 33% మంది కోరుకున్నారు. బిజెపి వరుసగా రెండు పర్యాయాలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా 3 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పరచింది. అప్పుడు తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రి. ఆ పైన కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. రేపటి ఎన్నికల్లో బిజెపికి 39 శాతం ఓటు వాటా, కాంగ్రెస్‌కు 36.5 శాతం ఓటు వాటా లభించవచ్చని సర్వే వెల్లడించింది.
సిఎం మమతా బెనర్జీ ఒకవైపు పిఎం నరేంద్ర మోడీ, మరొక వైపు చాలా కాలంగా పరస్పరం కత్తులు దూసుకునే బరి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ. ఇక్కడి ఎన్నిక ఈసారి కూడా దేశ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్శిస్తోంది. కిందటి సారి ఎన్నికల్లో టిఎంసిని ఓడించి బిజెపి అధికారం చేపట్టనుందని మీడియా, పలు సర్వే సంస్థలు వేసిన అంచనాలు తలకిందులై చివరికి భారీ మెజారిటీతో గెలిచి మమతాయే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. పోటీ రసవత్తరంగా ఉన్నా ఈసారి కూడా మమత 7 శాతం ఓటు వాటా వ్యత్యాసంతో స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఇక్కడ వివాదాస్పదమైంది. వ్యతిరేకం అనుకునే ఓట్లను పనిగట్టుకొని తొలగిస్తున్నారని, ఇందుకు బిజెపికి కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) ఏకపక్షంగా సహకరిస్తోందని టిఎంసి ఆరోపిస్తోంది. లేని, చెల్లని, మృతుల, అర్హులు కాని బంగ్లా వలసదారుల ఓట్లతో వరుసగా గెలుస్తూ వస్తున్నారని, దాన్ని అడ్డుకుంటే గగ్గోలు పెడుతున్నారన్నది బిజెపి ప్రతి విమర్శ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసికి మొత్తం 2.89 కోట్ల ఓట్లు రాగా బిజెపికి 2.31 కోట్ల ఓట్లు లభించాయి. వ్యత్యాసం సుమారు 60 లక్షల ఓట్లుగా నమోదయింది.
ఈసారి ‘సర్’ ద్వారా తొలగించిన ఓట్లే 65 లక్షల వరకు ఉండటంతో.. తుది ఫలితాలపై ‘ఈ ప్రక్రియ ప్రభావం ఎంత?’ అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 28 నుంచి 30 శాతం వరకున్న ముస్లిం ఓట్లు బెంగాల్ ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతాయి. తన పార్టీ తమిళగ వెట్రి కజగం (టివికె) తరపున మొత్తం 234 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన సినీనటుడు విజయ్ చూపే ప్రభావాన్ని బట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఉండవచ్చు. ప్రస్తుత ప్రభుత్వంపై యువత కొంత అసంతృప్తితో ఉండటం, యువతే ప్రధానంగా విజయ్ వైపు ఆకర్శితులవటం కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక అవకాశాన్ని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2009 ఉమ్మడి ఎపి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని బరిలోకి దింపిన సినీనటుడు ‘చిరంజీవి కారకం’ లాంటిదే ఇది కూడా అని, ఇది పరోక్షంగా పాలకపక్షం డిఎంకెకి అనుకూలించేదే అని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా లేదని, అన్నాడిఎంకె గాని, బిజెపితో కలిసి ఎన్‌డిఎ కూటమి గానీ బలపడిందీ లేదనే అభిప్రాయం తమిళనాట ముందు నుంచీ ఉంది. దానికి ‘విజయ్’ ఫ్యాక్టర్ తోడవుతోంది. విజయ్ సభలు, ర్యాలీలకు పెద్ద సంఖ్యలో జనం, ముఖ్యంగా మహిళలు, యువత వస్తున్నారు.
వారిని నియంత్రించడం ఇబ్బందవుతోంది. గత సంవత్సరం కరూర్ సభ తొక్కిసలాటలో 41 మంది కార్యకర్తలు చనిపోవడం, వారిని పట్టించుకోకుండానే ఆయన వెళ్లిపోవడం వంటివి ఆయనకు కొంత మైనస్ కావొచ్చు. గుడ్డి అభిమానమే తప్ప పార్టీ వ్యవస్థ, యంత్రాంగం అంటూ ఏమీ లేదు. మరో ప్రాంతీయ పార్టీ నామ్ తమిళార్ ఖట్చి (ఎన్‌టికె) కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కిందటి సారి పోటీ చేస్తే సగటున 6 శాతం ఓటు వాటా సాధించింది. ఈసారి అది పది శాతం దాటొచ్చనే అభిప్రాయం ఉంది. సగటు తమిళ ఓటర్ ఉద్విగ్న -ఉద్రేక స్వభావం రీత్యా ‘విజయ్’ సంచలనం సృష్టిస్తారేమో అనే సందేహాలున్నప్పటికీ, ఇతరుల గెలుపోటముల్ని ప్రభావితం చేసే ఉత్ప్రేరకంగానే ఆయన పార్టీ మిగిలిపోవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
ఆయన ప్రకటించిన జాబితా ప్రకారం 106 మంది (45 శాతం) అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే! దీన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ టివికె సభ్యులే నిరసనలు, ఆందోళనలు జరిపారు. జయలలిత మరణానంతరం ఏ ఎన్నికా గెలవని అన్నాడిఎంకె బలహీనపడుతూ వస్తోంది. పార్టీ నాయకులు అటు డిఎంకె వైపో, ఇటు టివికె వైపో వలసబాట పట్టారు. వారిపై ఆధిపత్యంతో పొత్తుకు యత్నించిన బిజెపి, చివరకు ఏదో రకంగా పొత్తుతోనే సర్దుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌డిఎ తిరిగి అధికారంలోకి వచ్చి ఎన్ రంగస్వామి (ఎన్నార్ కాంగ్రెస్) మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా పుంజుకోకపోగా, 30 అసెంబ్లీ స్థానాల పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే ముగ్గురు ఎంఎల్‌ఎలు కీలకం అవుతారు కనుక ఎన్‌డిఎదే ఆధిపత్యం!
కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్‌కు మొదట్లో స్పష్టమైన ఆధిక్యత కనిపించినా అది క్రమంగా కరిగిపోతున్న జాడలు స్పష్టమవుతున్నాయి. ఆ మేర పాలక ఎల్‌డిఎఫ్ మెరుగుపడటమే కారణం! ప్రజలు ప్రతిసారీ ప్రత్యర్థి పార్టీల కూటమికి అధికారమిచ్చే కిందటి ఎన్నికల్లో అది తప్పింది. కమ్యూనిస్టు కూటమి అధికారాన్ని నిలబెట్టుకొని వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పరచింది. వ్యతిరేకత పెరుగుతూ వచ్చి, 2025 డిసెంబరులో జరిగిన మూడంచెల స్థానిక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ ఎదురీదింది. బిజెపి అక్కడక్కడ పెరిగింది. అదలా కొనసాగి, యుడిఎఫ్ లబ్ధి పొందే సూచనలు ఎన్నికల ప్రకటన వరకు స్పష్టంగానే ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీల్లో మునుపెన్నడు లేనంత వ్యతిరేకత, టిక్కెట్టు లభించని వారు పార్టీ క్రమశిక్షణను ఖాతరు చేయకుండా స్వతంత్రులుగా పోటీ చేయడం, పార్టీ బలంగా ఉన్న ఎస్‌సి, ఎస్‌టిల్లోని ఉపకులాల్లో వచ్చిన చీలికలు, వ్యతిరేకత వల్ల ఎల్‌డిఎఫ్ బలహీనమవుతూ వచ్చింది. కానీ, ఎన్నికల ప్రకటన తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చి ఎల్‌డిఎఫ్- యుడిఎఫ్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్న స్థితికి చేరింది. ఎన్‌డిఎ, ఇండియా కూటములు బలమైన ప్రత్యర్థులు, సిద్ధాంత వ్యతిరేకులే అయినా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్న అంశాలు స్థానికతను బట్టి వైవిధ్యభరితంగా ఉన్నాయి.
– దిలీప్ రెడ్డి( సమకాలీనం)
– రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ