Reading Time: < 1 minute

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 2026ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓటమితో ప్రారంభించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. అయితే సీజన్ ఆరంభానికి ముందే ఆ జట్టు అభిమానులకు ముఖ్యంగా ధోనీ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే.. స్టార్ ఆటగాడు, అభిమానులు ముద్దుగా ‘తలా’ అని పిలుచుకొనే ఎంఎస్ ధోనీ.. రెండు వారాలు జట్టుకు దూరం అవుతాడని ప్రకటన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. తొలి మ్యాచ్‌లో ధోనీ జట్టులో లేకపోవడమే ఓటమికి కారణం అని కొందరు భావించారు కూడా..

అయితే ఇప్పుడు నిరుత్సాహంలో ఉన్న చెన్నై ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ అందింది. ధోనీ రెండు వారాలు కాకుండా కాస్త ముందుగానే బరిలోకి దిగుతాడని సిఎస్‌కె సూచన అందించింది. ఇందుకు సంబంధించి తమ సోషల్‌మీడియా ఖాతాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ధోనీ తన కిట్‌ని తీసుకెళ్లడం మనం చూడొచ్చు. దీంతో ధోనీ కాస్త ముందుగానే మైదానంలోకి అడుగుపెడతాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకారం రెండు వారాల్లో సిఎస్‌కె నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. శుక్రవారం సొంత మైదానం చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడతుంది. మరి ఈ మ్యాచ్‌లో కాకపోయినా.. మూడో మ్యాచ్ వరకైనా ధోనీ జట్టుతో జతకడితే చూడాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.