Reading Time: 2 minutes

పాలమూరులో ఉల్లి రేటుపై సిండికేట్‌‌‌‌‌‌‌‌ పంజా !

Caption of Image.
  • దేవరకద్ర మార్కెట్‌‌‌‌‌‌‌‌లో వ్యాపారులు, రిటైలర్ల ఇష్టారాజ్యం
  • మేం చెప్పిన రేటే ఫైనల్‌‌‌‌‌‌‌‌ అన్నట్లు వ్యవహరిస్తున్న వ్యాపారులు
  • క్వాలిటీ ఉన్నా క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.600 నుంచి రూ.800లోపే చెల్లిస్తున్న వైనం
  • గంటల వ్యవధిలోనే డబుల్‌‌‌‌‌‌‌‌ రేటుకు అమ్ముకుంటున్న ట్రేడర్లు
  • కూలీ ఖర్చులు కూడా రావడం లేదంటున్న రైతులు

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌/చిన్నచింతకుంట, వెలుగు: ఉల్లి మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ట్రేడర్లు, రిటైల్  వ్యాపారులు సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారి రైతులను నిలువునా ముంచుతున్నారు. కనీస మద్దతు ధర ఇవ్వకుండా.. తాము చెప్పి రేటే ఫైనల్‌‌‌‌‌‌‌‌ అంటూ హల్ చల్ చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ‘నచ్చితే అమ్మండి.. లేదంటే మార్కెట్‌‌‌‌‌‌‌‌ నుంచి వెళ్లిపోండి’ అని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు చెప్పే రేటుకు అమ్మితే కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అడ్డుకోవడం, ధరలను నియంత్రించడంలో మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఫెయిల్‌‌‌‌‌‌‌‌ అయ్యాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారులు చెప్పిందే ఫైనల్‌‌‌‌‌‌‌‌..
మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా దేవరకద్ర అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ప్రతి బుధవారం ఉల్లి అమ్మకాలు జరుగుతుంటాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడా ఉల్లి మార్కెట్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్‌‌‌‌‌‌‌‌, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతాలకు చెందిన ఉల్లి రైతులు పంటను దేవరకద్రకే తీసుకొస్తుంటారు. ప్రస్తుతం ఉల్లి దిగుబడులు ప్రారంభం కావడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌కు పెద్ద ఎత్తున పంట వస్తోంది. దీంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌లోని ట్రైడర్లు, రిటైల్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులు సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారారు. బుధవారం ఉదయం పది గంటలకు దేవరకద్ర మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బహిరంగ వేలం ప్రారంభం కాగా.. వ్యాపారులు, రిలైటర్లు ప్రతి కుప్ప వద్దకు వెళ్లి ధర నిర్ణయించారు. 

తెల్ల ఉల్లిగడ్డ సైజు పెద్దగా ఉంటే క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.వెయ్యి లోపు, మీడియం సైజు గడ్డకు రూ.700 నుంచి రూ.850, చిన్న సైజు ఉంటే రూ.450 నుంచి రూ.600 వరకు ధర నిర్ణయించారు. ఎర్ర ఉల్లిగడ్డకు రేట్లను మరింత తగ్గించి… పెద్ద సైజు గడ్డ క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.650 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి రూ.700లోపు, మీడియం సైజుకు రూ.400 నుంచి రూ.450 గా నిర్ణయించారు. ఈ రేట్లు గిట్టుబాటు కావని క్వింటాల్‌‌‌‌‌‌‌‌పై రూ. 50 నుంచి రూ. 100 అధికంగా చెల్లించాలని రైతులు కోరినా పట్టించుకోకుండా.. తాము చెప్పిందే ఫైనల్‌‌‌‌‌‌‌‌ రేటు అంటూ స్పష్టం చేశారు. దీంతో గిట్టుబాటు కాదంటూ కొందరు రైతులు తమ పంటను తిరిగి తీసుకెళ్లారు.

అగ్గువకు కొని డబుల్‌‌‌‌‌‌‌‌ రేట్‌‌‌‌‌‌‌‌కు అమ్మకం..
దేవరకద్ర మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బుధవారం రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొన్న వ్యాపారులు, రిటైలర్లు.. గంటల వ్యవధిలో అదే మార్కెట్‌‌‌‌‌‌‌‌లో డబుల్‌‌‌‌‌‌‌‌ రేటుకు అమ్మేశారు. ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 12 గంటల వరకు బహిరంగ వేలం ముగించారు. ఆ తర్వాత ఉల్లి కొనుగోళ్ల కోసం హోటళ్ల నిర్వాహకులు, కిరాణ షాపుల దుకాణాదారులు, ప్రజలు మార్కెట్‌‌‌‌‌‌‌‌కు వచ్చారు. వ్యాపారులు తెల్ల ఉల్లి గడ్డ సైజును బట్టి రూ.1,400 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుంచి రూ.1,700 వరకు అమ్మగా… 50 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిలోల బ్యాగును రూ.750 నుంచి రూ.800 చొప్పున విక్రయించారు.

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం లేకపోవడంతో మోసాలు
పంట దిగుబడులను కొనుగోలు చేసేందుకు ఆయా పంటల రకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటిస్తాయి. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ విధానం ద్వారా ఈ పంట కొనుగోలుకు టెండర్లు నిర్వహిస్తాయి. కానీ ఉల్లిగడ్డకు ఇప్పటివరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్​ సౌకర్యం లేదు. ఈ పంట అమ్మకాలకు సంబంధించి ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఆప్షన్​ కూడా లేదు. ఉల్లిగడ్డకు మద్దతు ధర ఎంత ? అనేది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించడం లేదు. దీన్ని అదనుగా తీసుకున్న ట్రేడర్లు, రిటైల్‌‌‌‌‌‌‌‌ వ్యాపారాలు ప్రతి సీజన్‌‌‌‌‌‌‌‌లో రైతులను మోసం చేస్తున్నారు. ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ విధానంలోనే కొనుగోళ్లు జరుగుతుండడంతో వారు చెప్పిన రేటే ఫైనల్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. 

గిట్టుబాటు కాక తిరిగి తీస్తపోతున్న 
నాకున్న ఎకరం పొలంలో ఉల్లి సాగు చేసిన. 30 బస్తాల గడ్డ వచ్చింది. అమ్ముదామని మార్కెట్‌‌‌‌‌‌‌‌కు వస్తే తక్కువ ధరకు అడుగుతున్నారు. క్వింటాల్‌‌‌‌‌‌‌‌ గడ్డకు రూ.550 ఇస్తామంటున్నారు. ఈ ధర గిట్టుబాటు కావడం లేదు. అందుకే పంటను తిరిగి తీసుకుపోతున్న.

ఆంజనేయులు, రైతు, అప్పంపల్లి, కౌకుంట్ల మండలం

కూలీ ఖర్చులు కూడా వస్తలేవు 
నాకున్న రెండు ఎకరాల్లో ఉల్లి నారు పెట్టిన. ఇటీవల పంట తీస్తే 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ అద్దెకు మాట్లాడుకొని మార్కెట్‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చిన. వ్యాపారులు వచ్చి గడ్డను చూసి క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.600 చొప్పున చెల్లించారు. క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు మరో రూ. 150 పెంచాలని వేడుకున్నా రూపాయి కూడా పెంచలేదు. పంటను అమ్మితే కూలీ ఖర్చులు కూడా రాలేదు.

బి.రాములు, రైతు, గోప్లాపూర్‌‌‌‌‌‌‌‌, దేవరకద్ర మండలం

ప్రస్తుతం ధర లేదు 
తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉల్లి దిగుబడులు ప్రారంభం అయ్యాయి. లోకల్‌‌‌‌‌‌‌‌ వ్యాపారులు పక్క రాష్ట్రాల నుంచి పంటను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో స్థానికంగా పండిన పంటకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ తగ్గడంతో రేట్లు పడిపోయాయి.

జయలక్ష్మి, మార్కెట్ సెక్రటరీ, దేవరకద్ర

©️ VIL Media Pvt Ltd.