
ఒరాకిల్.. ఉద్యోగాలు తీసివేతలో మిరాకిల్స్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఒరాకిల్ కంపెనీ కింద ప్రస్తుతం లక్షా 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటికే 30 వేల మందిని తీసేసిన ఒరాకిల్.. 48 గంటలు గడవక ముందే మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. 30 వేల మంది ఉద్యోగుల తొలగింపు తర్వాత.. కంపెనీలో మిగిలిన లక్షా 60 వేల మందికి మెయిల్స్ పంపింది కంపెనీ. కంపెనీ మూల ధన వ్యక్తం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం వల్ల మీలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. మరో విడతలో భాగంగా మరికొన్ని వేల మందిని తొలగించే అవకాశం ఉందంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. కంపెనీ నుంచి వచ్చిన మెయిల్ చూసిన ఉద్యోగులు.. ఇప్పుడు మరింత ఆందోళనలో ఉన్నారు. ఏ రోజు.. ఏ ఉదయం బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అనే భయం పట్టుకుంది ఒరాకిల్ ఉద్యోగులకు.
ఉద్యోగులకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, HR నుంచి కాల్స్ కూడా లేకుండా జస్ట్ ఒక మెయిల్ ద్వారా లేఆఫ్స్ చేయటం ఒరాకిల్ ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకే అమెరికా, భారత్ సహా ఇతర దేశాల్లోని దాదాపు 30వేల మంది ఉద్యోగుల ఇన్-బాక్సుల్లోకి “మీ రోల్ తొలగించబడింది.. ఇదే మీ చివరి పనిదినం” అంటూ మెయిల్స్ ల్యాండ్ అయ్యాయి. సంస్థలోని మొత్తం లక్షా 62వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడింది.
ఒరాకిల్ తన డేటా సెంటర్ మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా AI కోసం సిద్ధం చేసేందుకు భారీగా నిధులను సమీకరిస్తోంది. ఎన్విడియా, మెటా, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజాలకు క్లౌడ్ సేవలు అందించేందుకు 2025లో సుమారు 50 బిలియన్ డాలర్ల రుణాన్ని సేకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈ వ్యయాలను తట్టుకోవడానికి, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడానికి FY26 పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ లేఆఫ్స్‌ను అమలు చేస్తోంది.
ఒరాకిల్ తన ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే ప్రతి ఉద్యోగి నుండి వచ్చే లాభం తక్కువగా ఉంది. అందుకే ఉత్పాదకతను పెంచేందుకు ఈ కోతలు అనివార్యమని వారు అభిప్రాయపడుతున్నారు. తొలగించిన అమెరికా ఉద్యోగులకు మొదటి ఏడాదికి 4 వారాల బేసిక్ శాలరీ, ఆపై ప్రతి ఏడాదికి ఒక వారం అదనంగా (గరిష్టంగా 26 వారాలు) సెవరెన్స్ ప్యాకేజీగా అందజేస్తున్నారు.
ఒకవైపు స్టాక్ మార్కెట్‌లో ఒరాకిల్ షేర్లు ఒడిదుడుకులకు లోనవుతుండగా, మరోవైపు ఈ మెయిల్స్ ప్రకంపనలు ఐటీ నిపుణుల్లో తీవ్ర ఆందోళనను నింపుతున్నాయి. మౌలిక సదుపాయాల కోసం మానవ వనరులను బలిపెట్టడం ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.