Reading Time: 2 minutes

సహజీవనం చేశా ఆస్తిలో వాటా ఇప్పించండి.. రాజేష్ ఖన్నా కేసులో బాలీవుడ్ నటికి కోర్ట్ షాక్!

Caption of Image.

బాలీవుడ్ దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ఆస్తులు, ఆయనతో ఉన్న సంబంధంపై సుదీర్ఘ కాలంగా సాగుతున్న న్యాయపోరాటంలో నటి అనితా అద్వానీకి చుక్కెదురైంది. రాజేష్ ఖన్నాతో తనకున్న బంధాన్ని వివాహంగా గుర్తించాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు బుధవారం ( ఏప్రిల్ 1, 2026 ) కొట్టివేసింది. ఈ తీర్పుతో ఖన్నా కుటుంబ సభ్యులు డింపుల్ కపాడియా, ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్‌లకు పెద్ద ఊరట లభించింది.

వివాదం ఏమిటి?

2012లో రాజేష్ ఖన్నా మరణించిన తర్వాత, అనితా అద్వానీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. తాను రాజేష్ ఖన్నాతో చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్నానని, ఆయన తన నుదుట సింధూరం దిద్ది రహస్యంగా వివాహం చేసుకున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. రాజేష్ ఖన్నా నివసించిన ఐకానిక్ బంగ్లా ‘ఆశీర్వాద్’లో తనకు వాటా ఉందని, ఖన్నా కుటుంబ సభ్యులు తనను బలవంతంగా బయటకు పంపేశారని ఆమె కోర్టును ఆశ్రయించారు.

అయితే, రాజేష్ ఖన్నా భార్య డింపుల్ కపాడియా దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. డింపుల్ , రాజేష్ ఖన్నా విడివిడిగా ఉంటున్నప్పటికీ, వారు ఎప్పుడూ అధికారికంగా విడాకులు తీసుకోలేదు. చట్టబద్ధంగా డింపుల్ కపాడియానే ఆయన భార్య అని, అనితా అద్వానీకి ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవని ఖన్నా తరపు న్యాయవాదులు వాదించారు.

కోర్టు తీర్పు

జస్టిస్ షర్మిలా దేశ్‌ముఖ్ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. 2017లోనే కింది కోర్టు ఆమె పిటిషన్‌ను సాంకేతిక కారణాలతో కొట్టివేయగా, అనిత హైకోర్టుకు వెళ్లారు. కానీ హైకోర్టు సైతం ఆమె వాదనలను తోసిపుచ్చింది. గతంలో ఖన్నా కుటుంబంపై అనిత గృహహింస కేసు కూడా పెట్టింది. అయితే 2015లోనే హైకోర్టు ఆ కేసును కొట్టివేసింది. రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో అనిత ఆయనను సరిగా చూసుకోలేదని, కేవలం ఆస్తుల కోసమే ఆమె ఇలా చేస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు అనితా అద్వానీ చేసిన వివాహ గుర్తింపు అభ్యర్థనను మాత్రం కోర్టు పూర్తిగా తిరస్కరించింది.

ఎవరీ అనితా అద్వానీ?

అనితా అద్వానీ ఒకప్పటి నటి. ఆమె ‘దాసి’, ‘ఆవో ప్యార్ కరేన్’, ‘సాజిష్’ వంటి చిత్రాలలో నటించారు. ‘బిగ్ బాస్’ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొని రాజేష్ ఖన్నాతో తనకున్న అనుబంధం గురించి బహిరంగంగా మాట్లాడి చర్చకు దారితీశారు. ఆయన మరణం తర్వాత ఆస్తుల్లో వాటా కోసం కోర్టును ఆశ్రయించింది. భారతీయ చలనచిత్ర రంగంలో మొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా.  ఎన్నో హిట్ చిత్రలతో రికార్డు సృష్టించిన ఆయన 2012 జూలైలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత వచ్చిన ఈ ఆస్తి , వివాహ వివాదాలు చివరకు న్యాయస్థానం తీర్పుతో ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే  రాజేష్ ఖన్నా అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడి పేరు ఇలాంటి వివాదాల్లో రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.