
హైదరాబాద్: పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ అయిన ఐప్యాక్ ఆఫీసుల్లో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక తనిఖీలు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలోని ఐప్యాక్ కార్యాలయాల్లో గురువారం ఈ సోదాలు జరిగాయి. త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి టీఎంసీ పార్టీకి ఐప్యాక్ ప్రస్తుతం పనిచేస్తుండటం గమనార్హం. కోల్ స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఐప్యాక్ కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాదులోనూ ఈడీ సోదాలు జరిగాయి. దేశవ్యాప్తంగా 10 చోట్ల సోదాలు ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
#ED is conducting searches at the premises of Senior Executive of political consultancy firm, #IPAC in Bengaluru, Hyderabad & Mumbai in an alleged money laundering case linked to #CoalScamProbe.
— Kamlesh Kumar Ojha🇮🇳 (@Kamlesh_ojha1) April 2, 2026
మనీ లాండరింగ్ కేసులో I-PAC సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇళ్లలో కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేసింది. టీఎంసీ హయాంలో బోగస్ అగ్రిమెంట్లతో అక్రమ మైనింగ్కు పాల్పడి బొగ్గు స్మగ్లింగ్ చేసినట్లు సీబీఐ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేసింది. అయితే ఆ అగ్రిమెంట్లు చేసుకున్న రెండు కంపెనీల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కుటుంబానికి వాటాలు ఉన్నాయని, ఆయన తండ్రి అమిత్ బెనర్జీ ఒక కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నాడని, ఈ కంపెనీల్లో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఐప్యాక్ చీఫ్గా ఉన్న ప్రతీక్ జైన్, ఢిల్లీలో ఐప్యాక్ వ్యవహారాలు చూసుకుంటున్న రిషి రాజ్ సింగ్‌లను ఢిల్లీలో విచారించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భావిస్తోంది.ఈ ఇద్దరూ ఢిల్లీలో ఉన్నారో.. లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉద్దేశపూర్వకంగానే ఈడీ ఈ తనిఖీలు చేసినట్లు సమాచారం. బొగ్గు కుంభకోణం కేసులో ఐప్యాక్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. జనవరి 8న దర్యాప్తు అధికారులు ఐప్యాక్ కార్యాలయంలో, ప్రతీక్ జైన్ ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో సీఎం మమతా బెనర్జీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి అక్కడ ఉండటంపై ఈడీ ఇప్పటికే ఒక కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, బొగ్గు కుంభకోణంలో విచారణ నిమిత్తం ప్రతీక్ జైన్, రిషిరాజ్ సింగ్‌లను ఢిల్లీకి ఈడీ పిలిపించింది. ఈ సమన్లకు వ్యతిరేకంగా ప్రతీక్, రిషి ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. తాము పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల కోసం వ్యూహాలు రచించడంలో నిమగ్నమై ఉన్నందున, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా కోల్‌కతాలో విచారణను ఎదుర్కోవాలని వారు కోరారు. అయితే.. ఈడీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ విచారణకు ఒప్పుకోలేదు. వీడియో కాన్ఫరెన్స్లో ఒక డాక్యుమెంట్ను గురించి ప్రశ్నించే క్రమంలో.. ఆ డాక్యుమెంట్ను చూపించాల్సి వస్తుందని.. అలా చూపిస్తే ఆ డాక్యుమెంట్ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఈడీ వాదించింది.
ఈ దర్యాప్తు ఐదు సంవత్సరాలుగా ఎందుకు కొనసాగుతోందని న్యాయమూర్తి ఈడీని ప్రశ్నించారు. కోల్‌కతాలో విచారణ ఎందుకు సాధ్యం కావడం లేదనే విషయంలో అఫిడవిట్ సమర్పించాలని కూడా ఈడీకి న్యాయమూర్తి సూచించారు. ఏప్రిల్ 2 తర్వాత ఎప్పుడైనా ప్రతీక్ జైన్‌ను ఢిల్లీ కార్యాలయానికి పిలిపించవచ్చని అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు ఈడీకి స్పష్టం చేశారు. ఆ రోజు రానే రావడంతో ఈడీ ఐప్యాక్ కార్యాలయాలపై మెరుపు దాడులకు దిగింది.