Reading Time: < 1 minute
Sonali Bendre Land Dispute Pune Farmer Allegations Civil Court Case

బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ చిక్కుల్లో చిక్కుకుంది. తమ భూమిని సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్ అక్రమంగా ఆక్రమించుకున్నారని రైతు చంద్రకాంత్ షిండే సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. అంతేకాకుండా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

ఏం జరిగిందంటే..
పుణె జిల్లా మావల్ ప్రాంతానికి చెందిన రైతు చంద్రకాంత్ షిండే తమ కుటుంబానికి 1957 నుంచి వారసత్వంగా వస్తున్న సుమారు 30 గుంటల భూమిని సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బేహల్ అక్రమంగా కొనుగోలు చేశారని అన్నదాత ఆరోపించాడు. గోల్డీ బేహల్ అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. తమ హక్కులను పట్టించుకోలేదని బాధిత రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ చంద్రకాంత్ షిండే వడగావ్ మావల్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణం కూడా చేస్తున్నారని ఆరోపించాడు. భూమి ఆక్రమించుకోవడమే కాకుండా తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

సోనాలి బెంద్రే వివరణ
అయితే రైతు చేసిన ఆరోపణలను సోనాలి బెంద్రే, ఆమె న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. భూమి కొనుగోలు పత్రాల్లో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, డబ్బులు కోసమే ఇదంతా దుర్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నటి తరఫు న్యాయవాది రాజు షిండే మాట్లాడుతూ.. ఇదే అంశంపై రైతు గతంలో తహసీల్దార్, సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర పలుమార్లు ఫిర్యాదులు చేశారని, అవన్నీ కొట్టివేశాయని గుర్తుచేశారు. కేసును విచారించిన న్యాయస్థానం.. సోనాలి బెంద్రే, గోల్డీ బేహల్‌తో పాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.