Reading Time: < 1 minute

ప్రయాణికులకు ఇండిగో షాక్: ఇంటర్నేషనల్ ఫ్లైట్ టిక్కెట్లపై రూ.10వేల వరకు పెంపు

Caption of Image.

ఇరాన్ యుద్ధం కారణంగా విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులపై అదనపు భారాన్ని మోపింది. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా విమాన టిక్కెట్ ధరలను పెంచుతూ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఏప్రిల్ 2 అర్ధరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ప్రయాణించే దూరాన్ని బట్టి ఈ ఛార్జీలు మారుతుంటాయి. దేశీయ విమానాలపై గరిష్టంగా రూ.950 వరకు, అంతర్జాతీయ విమానాల ప్రయాణాలపై ఏకంగా రూ.10వేల వరకు ఫ్యూయల్ సర్ ఛార్జ్ వసూలు చేయనుంది కంపెనీ. కేవలం 18 రోజుల వ్యవధిలో ఇండిగో ధరలను పెంచడం ఇది రెండోసారి కావటంతో విమాన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విమాన ఇంధనం(ATF) ధరలు భారీగా పెరగటమే ఈ భారానికి ప్రధాన కారణం. అంతర్జాతీయ మార్కెట్‌లో గత నెల రోజుల్లోనే జెట్ ఫ్యూయల్ ధరలు 130% పైగా పెరిగాయి. సాధారణంగా ఒక విమానయాన సంస్థ నిర్వహణ ఖర్చులో 30% నుండి 40% కేవలం ఇంధనం కోసమే ఖర్చవుతుంది. దీనికి తోడు రాజ్యసభలో ఆమోదం పొందిన కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఏటీఎఫ్ పై లీటరుకు రూ.50 అదనపు ఎక్సైజ్ సుంకం విధించడం విమానయాన సంస్థల బడ్జెట్‌ను తలకిందులు చేసింది. ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణాలపై కేవలం 25% వరకు మాత్రమే ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇండిగో ప్రయాణ దూరం ప్రాతిపదికన రీ-క్యాలిబ్రేటెడ్ పద్ధతిలో ఛార్జీలను సవరించింది.

కేవలం భారతీయ విమానయాన సంస్థలే కాకుండా న్యూజిలాండ్, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, నార్డిక్ దేశాల్లోని ఎయిలైన్ కంపెనీలు కూడా పెరిగిన ఇంధన ఖర్చులను తట్టుకోలేక టిక్కెట్ ధరలను పెంచాయి. అయితే పరిస్థితులకు అనుగుణంగా తాత్కాలికంగా చేసిన సవరణ మాత్రమే ఇది అంటూ ఆయా సంస్థకు కస్టమర్లకు చెబుతున్నాయి.

    

©️ VIL Media Pvt Ltd.