Reading Time: 2 minutes

తెలంగాణపై కేంద్రం అన్నింటా వివక్ష: ఎంపీ వంశీకృష్ణ

Caption of Image.

రైల్వే కేటాయింపుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపుచూస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఏపీకి వేల కోట్లు కేటాయిస్తున్న రైల్వే శాఖ.. తెలంగాణకు మాత్రం రూ.100 కోట్లు, ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులను ఇచ్చి మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. పూర్తి అన్యాయంగా ఇరు రాష్ట్రాల మధ్య రైల్వే కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాగే, ప్రస్తుతం ఏపీలో ఏడు నుంచి తొమ్మిది ఎయిర్‌‌పోర్ట్ లు ఉన్నాయని, తెలంగాణలో మాత్రం ఒకే ఒక్క ఎయిర్ పోర్ట్ ఉందని సభ దృష్టికి తెచ్చారు. ఈ విషయంలోనూ కేంద్రం పక్షపాతం చూపుతున్నదని విమర్శించారు. 

పెద్దపల్లికి కూడా ఎయిర్‌‌పోర్ట్ ఇవ్వాలని పలుమార్లు కేంద్ర మంత్రిని కలిసి కోరినట్టు చెప్పారు. ఈ అభ్యర్థనపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించలేదని అన్నారు. ‘‘ఈ విషయాన్ని సభ్యులు గమనించాలి. ఎందుకు నీళ్లు, ఎయిర్‌‌పోర్ట్‌లు, ఇతర అంశాల్లో అన్యాయం చేస్తుందో ఆలోచించాలి’’ అని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భద్రాచలం, కొత్తగూడెంలో ముంపు జలాలతో దాదాపు 2 లక్షల మంది జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ముంపు ప్రాంతంలో కరకట్ట కట్టి స్థానిక ప్రజల్ని కాపాడాలని సభ ద్వారా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. 

బుల్లెట్ గాయాలను లెక్క చేయకుండా కేంద్ర మాజీ మంత్రి కాకా( జీ వెంకటస్వామి) తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు.  ఎంతో మంది పోరాడి సాధించుకున్న తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరని అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.  నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకుంటే.. ఆ మూడింటిని కేంద్రం అడ్డుకుంటున్నదని తెలిపారు.  విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చుకుండా.. ఏపీకి మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో సెమీకండక్టర్, నిధులు, నీళ్లు, రైల్వే ప్రాజెక్టులు మళ్లిస్తున్నదని అన్నారు.  విభజన చట్టంలోని హామీ ప్రకారం బయ్యారం స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన సందర్భంలో ఏపీ నుంచి తెలంగాణ కు రావాల్సిన దాదాపు రూ. 20 వేల కోట్లు ఇప్పించాలని కోరారు.  

నీళ్ల విషయానికి వస్తే.. ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల– నల్లమల సాగర్ విషయంలో కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్‌లు చర్యలు తీసుకోకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని అన్నారు.  దాదాపు లక్ష కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కుగా రావాల్సిన దాదాపు 200 టీఎంసీల నీళ్లను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్నదని చెప్పారు.  దీనివల్ల తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దపల్లి నియోజక వర్గం కరువు ప్రాంతంగా మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పార్లమెంట్ రికార్డ్‌లో పెట్టాలని  స్పీకర్‌‌ను కోరారు. 

కేంద్రంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నందున ఏపీ సీఎం చంద్రబాబు, డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట ఈ ప్రాజెక్ట్‌కు మద్దతు తెలుపుతున్నట్టు కేంద్రం వైఖరి ఉందన్నారు.  రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ  తన నియోజక వర్గంలోనే ఉన్నదని, అయినా తెలంగాణలో ఎరువుల కొరత వస్తున్నదని.. అదే ఏపీలో ఎలాంటి సమస్య లేదన్నారు.
 

©️ VIL Media Pvt Ltd.