Reading Time: 4 minutes

రెండు దేశాలకే కాదు…ప్రపంచానికే పెనుముప్పుగా మారిన యుద్ధం.. 

Caption of Image.

యుద్ధం అనేది మానవ సమాజానికి అత్యంత ప్రమాదకరం. చరిత్రలో జరిగిన ప్రపంచ యుద్ధాలు అపార నష్టాన్ని మిగిల్చాయి.  యుద్ధం వల్ల కేవలం రెండు దేశాలకే కాదు,  మొత్తం  ప్రపంచానికే  కోలుకోలేని నష్టం జరిగి ఆర్థిక సంక్షోభంలోకి అనివార్యంగా నెట్టబడతాయి.   యుద్ధం వల్ల జరిగే ప్రధాన నష్టం  ప్రాణనష్టం.  లక్షలాది మంది సైనికులు,  సాధారణ ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతారు. అనేక కుటుంబాలు తమ బంధువులను కోల్పోయి దుఃఖంలో  మునిగిపోతాయి. రెండోది ఆర్థిక నష్టం.  యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది.  పరిశ్రమలు, వ్యవసాయం నిలిచిపోతాయి.  ప్రభుత్వాలు రక్షణ ఖర్చుల కోసం భారీగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తుంది.

మూడవది  మౌలిక సదుపాయాల నష్టం.  యుద్ధ సమయంలో రహదారులు, వంతెనలు, భవనాలు ధ్వంసమవుతాయి.  విద్యుత్, నీటి సరఫరా వంటి అవసరమైన సేవలు నిలిచిపోతాయి. నాలుగోది శరణార్థుల సమస్య. యుద్ధం కారణంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఫలితంగా ఇరాన్​లో ఇప్పటికే ప్రజలు సంక్షోభంలో బతుకుతున్నారు.

యుద్ధం అభివృద్ధికి విరుద్ధం

యుద్ధం పర్యావరణానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తోంది.  అణు,  రసాయన ఆయుధాల వాడకం వల్ల గాలి,  నీరు కాలుష్యం చెందుతాయి. ఆరోగ్య  సమస్యలు పెరిగి ప్రజలు  అనారోగ్యానికి  గురవుతారు. అంతేకాకుండా యుద్ధం వల్ల ప్రజల్లో భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి పెరుగుతుంది.   మొత్తంగా చూస్తే, యుద్ధం అనేది  అభివృద్ధికి విరుద్దం,   విధ్వంసానికి ప్రతి రూపం.   అందువల్ల  దేశాలు శాంతి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం  అత్యంత అవసరం.

అమెరికన్లు నినదిస్తున్న ‘నో కింగ్​  నో వార్​’ 

పశ్చిమాసియాలో  జరుగుతున్న  ఇరాన్,  అమెరికా,  ఇజ్రాయెల్ యుద్ధం  గత  నెల రోజులుగా  తీవ్రస్థాయిలో  కొనసాగుతూ  ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది.  యుద్ధంపై అమెరికా ఇప్పటికే 27 బిలియన్  డాలర్లు  ఖర్చు చేసింది. యుద్ధానికి ప్రతి సెకనుకు 10,300 వేల డాలర్స్ ఖర్చు అవుతున్నాయి,  ఆయుధాలకు, 320మిలియన్, విమానాలకు 245 మిలియన్,  నేవీకి 155 మిలియన్, రక్షణ వ్యవస్థకు 95 మిలియన్ డాలర్లు,  దీనివలన భవిష్యత్ లో  అమెరికా ఎదుర్కొనే  సంక్షోభం గ్రహించి అమెరికా చరిత్రలో తొలిసారి 50 రాష్ట్రాలలో  ‘నో కింగ్   నో వార్’  నినాదంతో  లక్షలాది ప్రజలు నిరసన వ్యక్తం చేశారు, ఇరాన్,  ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు యుద్ధం ముగియాలని కోరుకుంటున్నాయి.   కానీ అమెరికా అవలంబిస్తున్న  విధానాల వలన యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.

భారత్​లో సంక్షోభం

హార్మూజ్​  జలసంధి  తెరిచేందుకు ప్రయత్నిస్తే  ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి.  నాటో  కూటమిని  ట్రంప్ మద్దతు కోరినా సానుకూల స్పందన లేదు.  దీనితో అమెరికా దిక్కు తోచని పరిస్థితుల్లో కూరుకుపోయిందని అర్థమవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఇతర గల్ఫ్ దేశాలు అనేక రకాల నష్టాలు ఎదుర్కొంటున్నాయి.  తిరిగి కోలుకోవడానికి ఎన్ని ఏండ్లు పడుతుందో చెప్పలేం.   అమెరికా  సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడులు చేయడం కొనగిస్తూనే వుంది.  పైగా అమెరికాకు  చెందిన 18 కంపెనీలపై  దాడులు చేస్తామని హెచ్చరించడంతో  లక్షలాది ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  
అమెరికా  మద్దతుతో  ఇజ్రాయెల్  ఇరాన్ పై  నిరంతర దాడులు చేస్తోంది,  అయితే యుద్ధంతో  ఎలాంటి సంబంధం లేని భారతదేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.  అన్ని రంగాలలో  సంక్షోభం నెలకొంది.  యుద్ధ ప్రభావంతో తగ్గిన నౌకల రవాణా వల్ల ముడి సరుకు దిగుమతి తగ్గి రెట్టింపు స్థాయిలో ధరలు పెరిగాయి.  ఒక్క ఫార్మా రంగంలోనే మార్చినెలలో  రూ. 5000 కోట్లు  నష్టం జరిగింది అని అంచనా వేస్తు న్నారు.  చమురు, గ్యాస్ ధరల పెరుగుదల, ఆహార పదార్థాల కొరత, వలన సామాన్య ప్రజలకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తప్పని పరిస్థితి.   వ్యవసాయ రంగంలో  కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది, 

భారీగా పెరిగిన చమురు, ఎరువుల ధరలు

ఇరాన్​పై దాడులకు ముందు.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చమురు, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి, హార్మూజ్ జలసంధిని దాటే నౌకల నుంచి అధికారికంగా ఒక నౌకకు రూ.19 కోట్లు చెల్లించాలని  ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించింది.  దీనితో  చమురు ధరలు సామాన్య ప్రజలకు మరింత భారంగా మారనున్నాయి.    

గతంలో ఆపరేషన్  సిందూర్​లో  భాగంగా  పాకిస్తాన్  టెర్రరిస్ట్  స్థావరాలపై  భారత సైన్యం యుద్ధంలాంటి దాడులు చేస్తే వెంటనే అమెరికా పాక్ తో  చర్చలు జరిపి యుద్ధం ముగిసిందని  ఏక పక్షంగా  ట్రంప్   ప్రకటించిన  విషయం తెల్సిందే.  కానీ అమెరికా ఇరాన్ యుద్ధం వలన మన దేశం  ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి  బయటపడేందుకు ఇరాన్ తో  యుద్ధం ఆపడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రజల భావనగా ఉంది.  చివరకు  భారత ప్రభుత్వం అమెరికాతో మాట్లాడడానికి ఎందుకు భయపడాల్సి వస్తుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.  

నిరుద్యోగం మరింతగా..

మనం ఎదుర్కొంటున్న సమస్యలు నివారించడానికి చేస్తున్న  ప్రయత్నాలేమోగానీ, యుద్ధం వలన కలిగే నష్టం ఏమీ లేదని  ప్రకటనలు మాత్రం చేస్తున్నారు.  హైదరాబాద్ లాంటి నగరంలో ఆటోలు గ్యాస్  దొరకక 70 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.  కమర్షియల్  సిలిండర్స్ దొరకక హాస్టళ్లలో ఉండే విద్యా ర్థులు, టిఫిన్ సెంటర్లు, హోటల్స్ గ్యాస్​ కొరతతో  లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు.  పెట్రోల్, డీజిల్  భవిష్యత్ లో సంక్షోభం ఎదుర్కోవచ్చు,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంక్షోభంలో భాగంగా ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది.

ఇరాన్​ ప్రతిఘటనతో అమెరికా  బెంబేలు

ఇజ్రాయెల్​తో  కలిసి ఇరాన్​పై  యుద్ధానికి దిగిన అమెరికా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  దూకుడుగా సైనిక దాడులకు దిగిన అమెరికాకు  ఇరాన్ ప్రతిఘటనతో బెంబేలు ఎత్తింది.  వారంలో  ముగించి విజయాన్ని సాధిద్దాం అని ట్రంప్ పెట్టుకున్న అతి విశ్వాసం ఇరాన్ ఆత్మ విశ్వాసంతో  ఓడిపోయిందనే చెప్పాలి.   ప్రపంచ పోలీస్​గా  ప్రకటించుకున్న అమెరికా ఇప్పుడు యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియని స్థితిలో ఉంది. యుద్ధంలో గెలవకున్నా  విజయాన్ని  ప్రకటించుకొని  చేయాల్సిన నష్టం  చేసేశాం అని చెప్పి తనది ఎప్పటికీ బలమైన సైనిక శక్తి అని ప్రచారం చేసుకుంటోంది.  ఇరాన్ తో  యుద్ధం అమెరికా చేసిన చారిత్రిక తప్పిదం అని ప్రపంచం భావిస్తోంది.  యుద్ధంలో దిగిన అమెరికా బయటపడడానికి  దారులు వెతుక్కోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు మాత్రం చేస్తోంది. 

యుద్ధం ఆపే దిశగా కేంద్రం అడుగులేయాలి

 ఇలాంటి స్థితిలో ఇప్పటికైనా భారత ప్రజలు గర్వపడే విధంగా అమెరికా  పెత్తనాన్ని ఆపే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలి.    అమెరికా డిక్టేట్ చేసినట్లు వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం నిలిపివేయాలి.   యుద్ధం వలన కలిగే  నష్టం  గురించి  ప్రజలకు  అవగాహన కల్పించాలి.  అందుకు అనుగుణంగా సిద్ధం చేయాలి.  యుద్ధం వలన వచ్చే నష్టాలు  సామాన్యులపై  భారం పడకుండా చూడాలి.   యుద్ధం ఆపడానికి సర్వ శక్తులు ఉపయోగించి కార్యాచరణ ప్రారంభించాలి.  రాష్ట్రాలలో  ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి.  ప్రతిరోజు  సమీక్షించి  రోజువారీ  తలెత్తే  పరిస్థితులను  పరిష్కరించడానికి  ప్రాధాన్యం ఇవ్వాలి.   రవాణా కార్మికులను ఆదుకోవాలి. చిన్న తరహా అహార వ్యాపారాలకు  గ్యాస్ అందించాలి.  హాస్టళ్లలో  విద్యార్థులకు  ఇబ్బందులు రాకుండా చూడాలి.  ప్రపంచ మానవాళికి యుద్ధం  ఒక ప్రమాదం. అమెరికా, ఇరాన్​  యుద్ధంతో  ప్రజల జీవితాలు భారంగా మారకూడదంటే.. భారత్​ వెంటనే యుద్దాన్ని ఆపే ప్రయత్నం   మొహమాట పడకుండా  బహిరంగంగా చేపట్టాలి. 

– దేవీప్రసాద్
పూర్వ అధ్యక్షుడు, టీఎన్జీఓ

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.

©️ VIL Media Pvt Ltd.