
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి అందుబాటులో లేనందున పరిపాలనకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు తన వద్దకు వచ్చారని, మంత్రులు డిప్యూటీ సిఎం వద్ద కు వస్తే తప్పా? అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. మంగళవారం మధిరలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం విదేశాల్లో ఉండటంవల్ల కొన్ని విధానపరమైన వి షయాలను మాట్లాడేందుకు మంత్రులు తనవద్ద కు వస్తే దానినీ రాజకీయం చేసి పెడార్ధాలు తీయ డం శోచనీయమన్నారు. కరీంనగర్ జిల్లా విషయంపై మాట్లాడేందుకు ఆ జిల్లా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, అడ్లూరి, ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తనను కలుస్తే తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకా రం త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడమే లక్ష్యంతో మంత్రివర్గం అంతా కలిసి కట్టుగా పనిచేస్తూ ముందుకు వెళ్తుందని అదే మా కల, మా ఆలోచన తప్ప ఇతరాత్ర వ్యవహారం ఏమీలేదన్నా రు. తెలంగాణ రాష్ట్రం నగరాల అభివృద్ధికి, ఉపా ధి అవకాశాలు పెంచేందుకు క్యూర్, ప్యూర్, రేర్ పాలసీనిరూపొందించామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని, గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా విజయభావుటా ఎగురవేసి తీరుతామన్నారు.గత పదేళ్ళలో మున్సిపల్లో అభివృద్ధి జరగలేదని, గడిచిన రెండేళ్ళ కాలంలో మున్సిపల్ వ్యవహారాలను చూస్తున్న సిఎం ఎన్నో అభివ్రద్ది కార్యక్రమాలను చేపట్టారని భట్టి పేర్కొన్నారు.
గడిచిన పదేళ్ళ కాలంలో గత ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఇప్పుడు అడిగిన వారికల్లా రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు దానిపై సన్నరకం బియ్యాన్ని కూడా పంపిణి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా 1.03 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని అల్ప ఆదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికలు మాకు రెఫరెండమ్ అనేవారు ముందుగా దాని అర్థం తెలుసుకొని మాట్లాడాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అంతా ఉమ్మడి కుటుంబంలో భావించి ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఈ సందర్బంగా పిలుపు ఇచ్చారు.అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో పట్టణ ప్రాంతాల్లో రకరకాల ప్రణాళికలతో నివసిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం ప్రపంచంతో పోటీ పడేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.పట్టణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మెప్మా ద్వారా మున్సిపాలిటీల్లో మహిళలకు 6000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు.
హైదరాబాద్ బయట మున్సిపాలిటీల పరిధిలో అనేక క్లస్టర్లుగా విభజన చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని, రేర్ రూరల్ అగ్రి రీజనల్ ఎకానమీ ద్వారా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి మున్సిపాలిటీల సమీపంలోని గ్రామాల్లో ఉపాధి, ఆదాయం పొందేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. గ్రామాల్లో ఉత్పత్తులకు మున్సిపాలిటీల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడమే తమ లక్ష్యమన్నారు రాష్ట్రంలోని మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని హైదరాబాద్ పట్టణంలోనే కాకుండా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేశామని,. ప్రపంచ స్థాయి విద్యను పేద బడుగు బలహీన వర్గాలకు అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. డైవర్షన్ కోసం సిట్ వేయలేదని ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ ఎప్పటి నుంచో జరుగుతుందని చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. తప్పు చేయని వారికి భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.ఈవిషయంలో ఎలాంటి రాజకీయ అంశాలు,కుట్రలు ఏమి లేవని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు టెండర్లలో కుంభకోణం లేదని అన్నారు. ‘నాకు ఫిర్యాదు ఇవ్వండి.. నేనే విచారణకు ఆదేశిస్తానని గతంలోనే చెప్పాను’ అని అన్నారు.