Reading Time: < 1 minute

సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సిఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రాలేదని విమర్శించారు. ఈ విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి అప్పుడప్పుడు ఫుట్ బాల్ ఆడుతూ, విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.సిఎం ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో ఏ పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ ఫోజులు కొడతా ఉన్నారని విమర్శించారు.

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలని, చదువుకోవాల్సిన సమయంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తదో ఒకసారి సిఎం కూడా ఆలోచించుకోవాలని సూచించారు. పది కోట్ల సింగరేణి నిధులు దుర్వినియోగం చేసి సిఎం ఫుట్ బాల్ ఆటకి వినియోగించుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలతో సిఎం ఎలాగో ఫుట్ బాల్ ఆడుతున్నారని.. కానీ, సింగరేణి సంస్థతో కూడా ఫుట్ బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఆ సంస్థకి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. ఒక్క స్కామ్‌కి సంబంధించి అన్ని ఆధారాలు బయటపెడితే కూడా ఇప్పటివరకు పాలకుల వైపు నుంచి సమాధానం లేదని విమర్శించారు.