
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బిజెపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, బిఆర్‌ఎస్ పని ఖతం అయ్యిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై ఏఐసిసి ముఖ్య నేతలతో చర్చించేందుకు సోమవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.రాష్ట్రంలో బిజెపి ఎన్ని పోరాటాలు చేసినా అధికారంలోకి రాలేదన్నారు. కర్నాటక, తెలంగాణలో బిజెపికి మనుగడ ఉండబోదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ పని కూడా అయిపోయిందని, రకరకాల కేసులతో ఆ పార్టీ నేతలు సతమతమవుతున్నారని అన్నారు. ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోషల్ మీడియాను పట్టుకుని పాకులాడుతున్నారని ఆయన విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను తమ పార్టీ సునాయసంగా కైవసం చేసుకుంటుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
బిసిలకు యాబైకి పైగా స్థానాల్లో టిక్కెట్లు ఇవ్వాలని వస్తున్న డిమాండ్ గురించి ప్రశ్నించగా, అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. నైనీ-కోల్ కుంభకోణం గురించి ప్రశ్నించగా, ఇదంతా మీడియా సృష్టేనని ఆయన దాట వేశారు. తాను ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌తో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పుడు కూడా నైనీ-కోల్ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. నిజామాబాద్‌లో బిఆర్‌ఎస్ ఉనికి పూర్తిగా కోల్పోయిందని ఆయన తెలిపారు. కాంగ్రెస్-బిజెపి మధ్యే పోటీ ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని ఆయన చెప్పారు. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలిని కూడా నియమించాల్సి ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత కొత్తగా పార్టీని స్థాపించి పోటీ చేసే ఆలోచనలో ఉందని అన్నారు. కాంగ్రెస్‌లో కవితను చేర్చుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా, ఆ ఆలోచన తమకు లేదన్నారు. తనకు ఉన్న సమాచారం మేరకు కవిత పార్టీ స్థాపించబోతున్నారని అన్నారు.
–==–