
ఇరోపియన్ యూనియన్ మంగళవారం గొప్ప స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం చుట్టాయి. దీనిని అన్ని ఒప్పందాల తల్లిగా ఉభయపక్షాల నేతలు అభివర్ణించారు.ప్రధాని నరేంద్రమోదీ, యురోపియన్ యూనియన్ అగ్ర నాయకత్వం కల్లోల ప్రపంచ క్రమంలో భారతదేశం, ఇయు మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు విసృ్తత రంగాలకు విస్తరించే వాణిజ్యం, రక్షణ పరమైన ఎజెండాతో కూడిన ఒప్పందాన్ని ఆవిష్కరించారు.ప్రధాని నరేంద్రమోదీ ఈయు నాయకులు ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఆంటోనియో కోస్టాలకు శిఖరాగ్రసమావేశాలకు చక్కటి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇరు పక్షాలనేతలు రెండు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒకటి భద్రత, రక్షణ పరమైన ఒప్పందం కాగా, మరొకటి యురోపియన్ యూనియన్ దేశాలలో భారతీయ సాంకేతిక ప్రతిభ విస్తరణకు సంబంధించినది. నియమాల ఆధారంగా గొప్ప దార్శనికతతో కూడిన ఒప్పందం ఇది.భారతదేశం, 27 దేశాల కూటమి రానున్న ఐదేళ్లలో ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక ఎజెండా అమలుకు సిద్ధమయ్యాయి. సమగ్ర వాణిజ్య ఒప్పందం చర్చల ముగింపు నేపథ్యంలో 13 కీలక ఒప్పందాలను ధ్రువీకరించాయి.
ప్రధాని మోదీ తన ప్రారంభోపన్యాసంలో ప్రపంచ వ్యవస్థ గొప్పగందరగోళంలో ఉన్న సందర్భంలో భారతదేశం, ఇయూ మధ్య భాగస్వామ్యం అంతర్జాతీయ వ్యవస్థ స్థిరీకరణకు, బలోపేతానికి దోహదపడుతుందని అన్నారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా ఒప్పందం సాకారమైందని ఆయన అన్నారు. భారతీయ రైతులు, చిన్నపరిశ్రమలకు యురోపియన్ మార్కెట్ అందుబాటులో ఉండేలా ఇది వీలుకల్పిస్తుంది, తయారీ, సేవా రంగాలలో కొత్త అవకాశాలు సృష్టిస్తుందని మోదీ ఒక మీడియా ప్రకటనలో తెలిపారు.స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశం, యురోపియన్ యూనియన్ మధ్య పెట్టుబడులు పెంచడంతో పాటు కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు సృష్టిస్తుందని మోదీ అన్నారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు.. ఇరు పక్షాల పురోభివృద్ధికి కొత్త బ్లూప్రింట్ అన్నారు మోదీ. ఇరుపక్షాలు చర్చలు ప్రారంభించిన 18 ఏళ్ల తర్వాత సమగ్ర వాణిజ్య ఒప్పందం రూపుదిద్దుకుంది. విపులంగా చర్చల అనంతరం ఇరు పక్షాలు ధృవీకరించిన అనంతరం అధికారికంగా ఒప్పందంపై సంతకాలకు కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చు.
మెగా వాణిజ్య ఒప్పందం కుదరడం పట్ల యురోపియన్ యూనియన్ అధ్యక్షురాలు వాన్ డెర్ లేయన్ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశం,ఇయు భాగస్వామ్యం ప్రపంచ సవాళ్లకు దీటైన సమాధానాన్ని బలమైన సందేశాన్ని పంపుతుందని ఆమె ఆకాంక్షించారు. యూరప్, అమెరికా మధ్య సంబంధాలలో పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయన్నారు. భారతదేశం, ఇయు – మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ – సాధించాయి. ఈ మెగా ఒప్పందంతో 200 కోట్ల ప్రజల మార్కెట్ ను సృష్టిస్తున్నాం అని ఆమె అన్నారు. ఇది రెండు ప్రపంచ దిగ్గజాలు రచించిన కథ. ప్రపంచంలో రెండో, నాల్గో అతి పెద్ద ఆర్థికవ్యవస్థలు – విన్ -విన్ – పద్ధతిలో భాగస్వామ్యాన్ని ఎంచుకుని, ప్రపంచానికి ఇస్తున్న బలమైన సందేశం ఇది అని వాన్ డెర్ లేయన్ అన్నారు. ఇయు,ఒక కూటమిగా భారతీయ ఉత్పత్తులకు అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరు పక్షాల మధ్య వాణిజ్యం 136 బిలియన్ అమెరికా డాలర్లమేరకు జరిగింది. దీనిలో ఎగుమతులు 76 బిలియన్ డాలర్లు కాగా, దిగుమతులు 60 బిలియన్ డాలర్లు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ టిఏ) వల్ల భారతీయ నైపుణ్యాలు, సేవలు,
యూరప్ సాంకేతికత, మూలధనం ఆవిష్కరణలతో ఎంతో రెట్లు వాణిజ్యం పెరుగుతుందన్నారు.వాణిజ్యం ఎన్నోరెట్లు పెరిగే క్రమంలో ఇయు వ్యూహాత్మకంగా ఇతరులపై ఆధారపడడం తగ్గిస్తామని, పరోక్షంగా అమెరికా , ట్రంప్ సుంకాలను, పాలనా విధానాలను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, యూరప్, భారతదేశం ఒకదానికొకటి నమ్మకమైన భాగస్వాములుగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆమెచెప్పారు.ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్యాలు మొట్టమొదటి భద్రత, రక్షణ భాగస్వామ్యాన్ని ప్రారంభించాయి అని ఆమె ప్రకటించారు.యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కోస్టా తన వ్యాఖ్యలలో రెండు పక్షాలు సంతకాలు చేసి కీలక ఒప్పందాలు నియమాలు ఆధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేస్తాయన్నారు. మంగళవారం కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగి ఉందని అన్నారు. భవిష్యత్ లో యురోపియన్ యూనియన్, భారతదేశాలు పరస్పర శ్రేయస్సు కోసం కృషి చేస్తాయని పేర్కొన్నారు.
ఉక్రెయిన్, పశ్చిమాసియా ప్రపంచ సమస్యలపై సమగ్ర చర్చ
శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా ఉక్రెయిన్, పశ్చిమాసియా, ఇండో – ఫసిఫిక్ పరిస్థితితో సహా అనేక ప్రపంచ సమస్యలపై ఉరు పక్షాలు వివరంగా చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతర్జాతీయ నిబంధనల పట్ల గౌరవం తమ ఉమ్మడి ప్రాధాన్యత అన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి ప్రపంచ సంస్థల సంస్కరణలు అవసరమని ఏకగ్రీవంగా తాము అంగీకరించినట్లు మోదీ తెలిపారు. ఉక్రెయిన్ పై యూరప్ దీర్ఘకాల వైఖరిని యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు పునరుద్ఘాటించారు.