
అమరావతి: టిడిపి పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్లకే కమిటీల్లో బాధ్యతలిచ్చామని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. పార్టీనే అందరికీ నాయకత్వం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 83 శాతం కొత్తవారికి పార్లమెంట్ కమిటీల్లో చోటు కల్పించామని, సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మనమంతా సైనికులమని తెలియజేశారు. అంజిరెడ్డి, మంజుల, తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు మనకు స్ఫూర్తి అని.. మడమ తిప్పడం, మాట మార్చడం టిడిపి రక్తంలోనే లేదని అన్నారు. ప్రజలకు సేవ, కార్యకర్తలకు సాయం చేయాలని.. నిరంతరం తపించే నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. పార్టీల్లో యువతకు అవకాశమివ్వాల్సిన అవసరం ఉందని, పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. పదవుల్లో సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, పార్టీల్లో మహిళలను గౌరవించాలని సూచించారు. తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని లోకేష్ పేర్కొన్నారు.