
హైదరాబాద్: తెలంగాణ వచ్చినా తొలి పదేళ్లలో మన సమస్యలు తీరలేదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సరైన విద్య అందితేనే పేదల సమస్యలు తొలుగుతాయని అన్నారు. నల్గొండ: బొట్టుగూడలో 8 కోట్ల వ్యయంతో సరికొత్తగా ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించారు. ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల కోమటి రెడ్డి ప్రారంభం చేశారు. 4 అంతస్థులు, 40 గదులతో అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ బోర్డులు, అన్ని రకాల క్రీడా సదుపాయాలు, టాయిలెట్లు, 36 గదుల్లో ఎసి సదుపాయం, మినీ ఆడిటోరియం, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ లు, ఇండోర్ స్పోర్ట్స్ రూమ్, వాటర్ ప్లాంట్లు, ఫ్రిజ్ లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్రపవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యపై ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు పెడుతోందని, నల్గొండలోని బొట్టుగూడ పాఠశాలను ఒక మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దామని తెలియజేశారు. బొట్టుగూడ స్కూల్ వంటి ప్రభుత్వ పాఠశాల దేశం మొత్తంలో మరెక్కడా కనిపించదని, కంప్యూటర్లు, డిజిటల్ బోర్డులు, క్రీడా సదుపాయాలు కల్పించామని అన్నారు.
మన విద్యార్థులకు మార్కులు బాగున్నా.. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదని, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకే స్కిల్ యూనివర్సిటీని సిఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారని కోమటి రెడ్డి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గం దాదాపు రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, కులం, మతం తేడా లేకుండా విద్యార్థులు చదువుకోవాలన్నది ఈ ప్రభుత్వ ఆశయం అని అన్నారు. ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించాలని.. మార్పు తీసుకురావాలని.. సూచించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామని, హ్యామ్ రోడ్లకు రూ.12 వేల కోట్లు కేటాయించామని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా తీసుకుంటున్నామని, ఇప్పుడు సిఎంను అడిగి కావాల్సినన్ని నిధులు తీసుకువస్తున్నానని అన్నారు. కొడంగల్ కు ఇచ్చినన్ని నిధులు నల్గొండకూ ఇవ్వాలని సిఎం అడిగానని, నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో నల్గొండకు నిధులు రాలేదని, గత మాజీ సిఎం కెసిఆర్.. తనను కలవనీయలేదని.. తమకు నిధులు ఇవ్వలేదని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.