Reading Time: < 1 minute

టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కి సిట్ నోటీసులు జారీ చేయడాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ప్లాప్ టివి సీరియల్‌ను తలపిస్తోందని ఒక ప్రకనటలో పేర్కొన్నారు. అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి, కేసుతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్షసాధింపు, అటెన్షన్ డైవర్షన్‌లో భాగమేనని విమర్శించారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల ముందు ప్రజల సమస్యల నుంచి దృష్టి మరల్చడం కోసమే ఈ కేసు, విచారణ డ్రామాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న భారీ అవినీతి, కుంభకోణాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే

రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిట్ విచారణను ఒక ఆయుధంగా వాడుకుంటోందని మండిపడ్డారు. ముఖ్యంగా నైని బొగ్గు గనుల కుంభకోణం బయటపడటంతో ప్రభుత్వం పీకల్లోతు కష్టాల్లో ఉందని, దానిని పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల డ్రామా అని పేర్కొన్నారు. గతంలో హరీష్ రావును, తనను కూడా ఇదే కేసు పేరుతో విచారించినా ఏమీ సాధించలేకపోయారని, ఇప్పుడు సంతోష్ కుమార్‌నుని లక్ష్యంగా చేసుకున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. మంగళవారం రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు బొగ్గు కుంభకోణంపై వినతిపత్రం ఇస్తామని తాము ప్రకటించిన వెంటనే సంతోష్‌కు నోటీసులు రావడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన అటెన్షన్ డైవర్షన్ అని ఆరోపించారు. సంతోష్ కుమార్‌కు పార్టీ అండగా ఉంటుందని, న్యాయస్థానాల్లో ఈ అక్రమ కేసులను ఎదుర్కొంటామని కెటిఆర్ తెలిపారు.