
జౌన్‌పుర్: చాలా మంది విద్యార్థులు డాక్టర్ కావాలని కలలు కంటారు. అందుకోసం ఎంతో కృషి చేస్తారు. ఎన్నో పరీక్షలను అధిగమించి డాక్టర్‌గా మారుతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం డాక్టర్ కావడం కోసం ఏకంగా తన పాదం నరుక్కున్నాడు. రెండుసార్లు నీట్ ప్రవేశ పరీక్ష రాసి విఫలమైన అతను.. దివ్యాంగుల కోటాలో తేలిగ్గా సీటు సంపాదించవచ్చని భావించి ఈ తీవ్రమైన చర్యకు పాల్పడ్డాడు. కానీ, చివరకు దొరికిపోయి.. పోలీసుల కేసు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్‌కి చెందిన సూరజ్ భాస్కర్(20) ఇటీవల తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి పారిపోయారని, పాదం తెగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని అతడి సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసు దర్యాప్తులో భాగంగా సూరజ్ ఇచ్చిన వాంగ్మూలంలో అనేక లోపాలు కనిపించాయి. దీంతో మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు.. అతడి ఫోన్‌ను పరిశీలించారు. అందులో ఓ మహిళ నెంబర్ తొలగించి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. అతడి డైరీలోనూ ‘‘2026లో నేను డాక్టర్ అవుతాను’’ అని రాసి ఉండటంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించగా.. షాకింగ్ విషయం తెలిసింది.
నీట్ పరీక్ష రెండుసార్లు రాసిన సూరజ్ అందులో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనై ఎలాగైనా సీటు పొందాలని భావించాడు. దివ్యాంగుల కోటాలో తేలికగా సీటు సంపాదించవచ్చని అనుకున్నాడు. ఇందుకోసం ఓ పాదాన్ని తొలగించుకున్నాడు. ప్రమాదంలో ఇదంతా జరిగిందని నమ్మించేందుకు.. గుర్తు తెలియని దుండగులు దాడి చేశారని కట్టుకథ అల్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో అతడిపై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలనే దానిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం సూరజ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.