Reading Time: 2 minutes

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఈ దేశాన్ని ‘Union of States’గా అభివర్ణించినప్పుడు, కేంద్రం, రాష్ట్రాలు ఒకదానికొకటి లోబడి ఉండకుండా, తమ పరిధుల్లో స్వయంప్రతిపత్తి కలిగిన సమాంతర శక్తులని భావించారు. కానీ నేడు ఢిల్లీ పీఠంపై ఉన్న పాలకులు ఈ ఫెడరల్ ఆత్మను క్రమంగా ఖాళీ చేస్తున్నారు. ఇది కేవలం పరిపాలనాపరమైన వైఫల్యం కాదు, ఇది రాష్ట్రాల ఉనికిని ప్రశ్నార్థకం చేసే ఒక పకడ్బందీ రాజకీయ వ్యూహం. రాష్ట్రాలను రాజ్యాంగబద్ధమైన భాగస్వాములుగా కాకుండా, కేంద్రానికి లోబడి ఉండాల్సిన ‘ఉపయూనిట్లు’గా మార్చే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నిధుల విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న సంపూర్ణ ఆధిపత్యం భారత ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా మారింది.రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే నిధులు ‘దయ’ లేదా ‘ఉపకారం’ కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేయబడిన ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధుల పంపిణీ జరగాలి. ప్రజలనుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన సంపదలో రాష్ట్రాలకు న్యాయబద్ధమైన వాటా ఉండాలి. అయితే, కేంద్రం ఈ పంపిణీని ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. కేంద్రం తెలివిగా పన్నులపై సెస్‌లు, సర్ఛార్జీలను విధిస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఈ సెస్‌ల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం లేదు.

గత దశాబ్ద కాలంలో కేంద్రం మొత్తం ఆదాయంలో సెస్‌ల వాటా 10% నుండి 25% పైగా పెరిగిపోయింది. దీనివల్ల కేంద్రం ఆదాయం విపరీతంగా పెరుగుతుంటే, రాష్ట్రాలకు పంచాల్సిన ‘డివిజిబుల్ పూల్’ తగ్గిపోతోంది. ఇది రాష్ట్రాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ‘ఆర్ధిక విచ్ఛిన్నత’. దక్షిణాది రాష్ట్రాల ‘పనితీరుకు శిక్ష’ ఫెడరల్ వ్యవస్థలో నేడు అత్యంత ఆందోళనకరమైన అంశం దక్షిణాది రాష్ట్రాలపట్ల చూపుతున్న వివక్ష. అభివృద్ధి చెందుతున్న, జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా శిక్షిస్తోంది. 15వ ఫైనాన్స్‌కమిషన్ నిధుల పంపిణీకి 1971 జనాభాకు బదులు 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు భారీగా నష్టపోయాయి. జనాభాను అదుపులో ఉంచి, తలసరి ఆదాయాన్ని పెంచినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి, వాటి నిధులను ఉత్తరాదికి మళ్లించడం ‘సహకార ఫెడరలిజం’ కాదు, అది ‘ఆర్ధిక వలసవాదం’. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల రూపంలో ఒక రూపాయి ఇస్తే, తిరిగి వస్తున్న వాటా అత్యల్పంగా ఉంది. రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే ప్రతి రూ. 1 కి తిరిగి రాష్ట్రానికి వచ్చేది. బీహార్ రూ. 7.06, ఉత్తరప్రదేశ్ రూ. 2.73, కర్ణాటక రూ. 0.15, తమిళనాడు రూ. 0.29, తెలంగాణ రూ. 0.43, ఆంధ్రప్రదేశ్ రూ. 0.49. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన జిఎస్‌టి, రాష్ట్రాల ఆర్థిక సార్వభౌమత్వంపై వేసిన అతిపెద్ద గొలుసు. ఒకప్పుడు రాష్ట్రాలకు తమ అవసరాల మేరకు పన్నులు విధించే స్వయంప్రతిపత్తి ఉండేది.

ఇప్పుడు రాష్ట్రాలు ఒక్క రూపాయి పన్ను మార్చాలన్నా కేంద్రం ఆధ్వర్యంలోని జిఎస్‌టి కౌన్సిల్ వైపు చూడాల్సి వస్తోంది. జిఎస్‌టివల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేస్తామని రాజ్యాంగబద్ధమైన హామీ ఇచ్చి, ఇప్పుడు ఆ పరిహారం విషయంలో కేంద్రం దోబూచులాడుతోంది. విపక్ష రాష్ట్రాలకు నిధులు విడుదల చేయకుండా జాప్యం చేయడం ద్వారా, అక్కడ అభివృద్ధిని కుంటుపరిచి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం ‘ఆర్థిక ఉగ్రవాదం’ కిందికే వస్తుంది. మరోవైపు, గవర్నర్ వ్యవస్థ నేడు ఒక ‘రాజకీయ ఏజెంట్’ వ్యవస్థగా మారిపోయింది. ఆర్టికల్ 200 దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులను నెలల తరబడి తొక్కిపెట్టడం ద్వారా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం అణచివేస్తోంది. దేశరక్షణ, విదేశాంగం కేంద్రం బాధ్యత కావచ్చు. కానీ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రాష్ట్రాల పరిధి. ఈ పరిధిలో కేంద్రం జోక్యం చేసుకుంటూ, నిధులు అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను లొంగదీసుకోవడం రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేయడమే. ఇది కేవలం రాష్ట్రాల సమస్య మాత్రమే కాదు, ఇది దేశ భవిష్యత్తు సమస్య. రాష్ట్రాలను ఆర్థికంగా అశక్తులను చేస్తే, ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది. ముఖ్యంగా దేశాభివృద్ధికి ఇంజిన్లుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూడటం దేశసమగ్రతకే ప్రమాదం. కేంద్రం తన ఆధిపత్య రాజకీయాన్ని ఆపకపోతే, భారతదేశం ఫెడరల్ ప్రజాస్వామ్య దేశంగా కాకుండా, కేంద్రీకృత అధికారవాద రాజ్యంగా మారిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం కేంద్ర దయ కాదు – అది ప్రజల హక్కు. ఆ హక్కును లాక్కోవడం రాజ్యాంగ ద్రోహం.

సిహెచ్ వి ప్రభాకర్ రావు

93915 33339