Reading Time: < 1 minute

ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో మరో శకం ముగియనుంది. ఆ దేశ మహిళ జట్టు కెప్టెన్ అలీసా హేలీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో భారత్‌తో జరిగే సిరీస్ తర్వాత తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది. దేశం తరఫున ఇంకా ఆడాలని ఉన్నా.. తనలో పోటీ తత్వం కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ పాడ్‌క్యాస్ట్‌లో వెల్లడించింది.

‘‘రానున్న భారత సిరీస్‌లో నేను చివరిసారిగి ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ కనిపిస్తాను. నాకు ఇప్పటికీ ఆస్ట్రేలియా తరఫున ఆడాల్సి ఉంది. కానీ, ప్రారంభం నుంచి నన్ను ముందుకు నడిపించిన పోటీతత్వాన్ని నేను కొంత కోల్పోయాను. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నా’’ అని అలీసా తెలిపింది.

‘‘నేను టి-20 జట్టులో లేను. కాబట్టి భారత్‌‌తో టి-20 సిరీస్‌లో ఆడటం లేదు. కానీ, నేను నా కెరీర్‌ను టెస్ట్, వన్డే కెప్టెన్‌గా స్వదేశంలో భారత్‌తో ఆడుతూ ముగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇది మాకు పెద్ద సిరీస్‌’’ అని పేర్కొంది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనంది. ఇందులో భాగంగా 3 టి-20లు, 3 వన్డేలు, పెర్త్ వేదికగా ఒక టెస్ట్ మ్యాచ్ జరుగనున్నాయి.