Reading Time: 3 minutes

కేంద్ర ప్రభుత్వం ఈసారైనా బడ్జెట్‌లో తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయిస్తుందా లేక సవతి తల్లి ప్రేమ చూపిస్తుందా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ఎఫ్‌ఆర్‌బిఎం) రుణ పరిమితిని ప్రస్తుతం ఉన్న 3.5 శాతం నుంచి 4 శాతానికి పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. ఈమేరకు ఢిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో తెలంగాణ డిప్యూటీ సిఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రత్యక్షంగా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. ఎఫ్‌ఆర్‌బిఎంను 2003లో అమలులోకి తెచ్చారు. ప్రభుత్వ నిధుల నిర్వహణను మెరుగుపర్చడం, పారదర్శకతను తీసుకురావడమే ఈ పథకం ముఖ్యలక్షం. ముఖ్యంగా ద్రవ్యలోటును తగ్గించడానికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అడ్డంకిగా మారాయని తెలంగాణ ఆర్థిక మంత్రి తన వాదనను వినిపించారు.

కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి భట్టి అనేక అంశాలను విన్నవించారు. వాటిలో గత కొన్నేళ్లుగా నలుగుతున్న అంశం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. జాతీయ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని గుర్తించాలని గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరినా కేంద్రం పట్టించుకోవడం లేదు. 2024 బడ్జెట్‌లో ఈ పథకం సంగతే కేంద్రం ప్రస్తావించలేదు. మళ్లీ ఈసారి కూడా ఈ ప్రాజెక్టు గురించే భట్టి కేంద్రానికి గుర్తు చేశారు. కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తి స్థాయిలో నిధులు రావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రధాని మోడీ దృష్టికి కూడా తీసుకు వచ్చారు. కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని కోరినా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటివరకు జరిగిన కేటాయింపులను పరిశీలిస్తే ఉదాహరణకు కేంద్ర ప్రాయోజిత పథకాల ( సిఎన్‌ఎస్ )కింద అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం రూ.4.60 లక్షల కోట్లను విడుదల చేసింది. జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే తెలంగాణకు 3 శాతం కింద దాదాపు రూ. 14 వేలకోట్లు రావలసి ఉంది.

కానీ కేవలం 1.4 శాతం అంటే రూ.6577 కోట్లు మాత్రమే తెలంగాణకు వచ్చాయి. అంటే సగం కన్నా చాలా తక్కువ. అలాగే అంతకు ముందు కేంద్రం నుంచి గ్రాంట్లుగా రూ. 41,259 కోట్లు తెలంగాణ బడ్జెట్‌కు వస్తాయని అంచనా వేయగా, రూ. 9729 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అనేక శాఖలకు అనుకున్న విధంగా నిధులు లభించని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఆర్థిక శాఖ చెబుతున్న అంచనాల ప్రకారం సెస్‌లు, సర్‌ఛార్జీల ద్వారా కేంద్రానికి దాదాపు 20 శాతం తెలంగాణ నుంచి ఆదాయం లభిస్తోంది. అయితే ఈ ఆదాయాన్ని పన్నుల్లో చూపకపోవడం వల్ల అందులో వాటా రాష్ట్రాలకు రావడం లేదు. ఫలితంగా ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు రావలసిన 41 శాతం వాటాకు బదులు 30 శాతం మాత్రమే అందుతోంది. ఈ లోపాన్ని సరిదిద్దడానికి రూ. 1.55 లక్షల కోట్ల సర్‌ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించి రాష్ట్రాలకు అందించాలని, లేదంటే ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని భట్టి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. 15 వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వారీగా చేసిన ప్రత్యేక సిఫార్సుల అమలును కేంద్ర ప్రభుత్వం అటకెక్కించింది. దీనివల్ల తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు రూ. 2362 కోట్లు, సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్లు రూ. 3024 కోట్లు వరకు తెలంగాణ నష్టపోవలసి వచ్చింది. ఇప్పుడు 16 వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేకంగా చేసిన సిఫార్సులను ఆమోదించడంలో ఈసారి కూడా ఉపేక్షిస్తే గతంలో మాదిరిగా తెలంగాణకు భారీ నష్టం కలగక తప్పదు.

అందుకనే ఆ సిఫార్సులను యథాతధంగా అమలు చేయాలన్నదే తెలంగాణ అభ్యర్థన. మరి ఎంతవరకు కేంద్రం ఈ అభ్యర్థనను మన్నిస్తుందో గమనించాలి. 202526 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టినప్పుడు 2025 బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినట్టు ప్రచారం జరిగింది. మరి ఈ పొరపాటు ఎలా జరిగిందో తెలీదు. సోషల్ మీడియాలో మాత్రం గణాంకాలతో సహా వైరల్ కావడం విస్మయం కలిగించింది.ఆ కేటాయింపులు ఎంతవరకు వాస్తవమో పరిశీలిస్తే అవన్నీ దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకు కలిపి ఆయా పథకాలకు కేందం కేటాయించిన నిధుల వివరాలని స్పష్టమైంది. తెలంగాణకు రూ.1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేసినట్టు వైరల్ కాగా, అంతమొత్తం తెలంగాణకు వడ్డీ లేని రుణంగా కేటాయించలేదని బయటపడింది.

మూలధన వ్యయం, సంస్కరణల ప్రోత్సాహకాల కోసం అన్ని రాష్ట్రాలకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,50,000 కోట్లు ప్రతిపాదించినట్టు తేలింది. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ. 10,000 కోట్లు, గ్రామీణ సడక్ యోజనకు రూ. 16,600 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం రూ. 9632 కోట్లు, పిఎం ఆవాస్ కోసం పట్టణ ప్రాంతాల్లో రూ.19794 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.34,426 కోట్లు, గృహ రుణ మాఫీ కోసం రూ.3500 కోట్లు కేటాయించినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవన్నీ దేశ వ్యాప్త పథకాలవే కావడం గమనార్హం. ఇంతకీ వార్షిక బడ్జెట్ 2025లో వివిధ పథకాల కింద తెలంగాణకు కేటాయించిన నిధుల వివరాలు సోషల్ మీడియాలో వెల్లడి కాకపోవడం అనేక అపోహలకు దారి తీసింది. ఇలా ఉండగా విభజన హామీల అమలు గురించి దాదాపు పదేళ్లుగా తెలంగాణ ఎదురు చూస్తున్నా నిరాశే మిగులుతోంది.