Reading Time: 2 minutes

దేశ, రాష్ట్ర పాలకులు ‘అభివృద్ధి’పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రత్యేకంగా ‘సమ్మిట్’లు నిర్వహిస్తూ ప్రపంచ పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామిక వేత్తలతో ఉదారంగా వ్యవహరిస్తున్నారు. వందలు, వేల ఎకరాలు కేటాయిస్తున్నారు. అందుకోసం వ్యవసాయ భూములు, నివాస స్థలాలను సేకరించడమే కాకుండా.. అడవులనూ అప్పనంగా అప్పగించేస్తున్నారు. దీంతో పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతున్నది. ‘అభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ’ను సరిసమానంగా చూడకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమవుతున్నది. పరిస్థితులు మరింత దిగజారుతుండడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నారు. అయితే అధికారంలోకి రావడానికి హామీల వరద పారించే జాతీయ, ప్రాంతీయ పార్టీలు.. పర్యావరణ పరిరక్షణను ఎన్నికల్లో ప్రధాన హామీగా ఎందుకు ప్రకటించడంలేదు అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతున్నది.

ప్రపంచ టాప్ టెన్ కాలుష్య నగరాల్లో ఐదు నుంచి ఏడు వరకు నగరాలు భారతదేశంలోనే ఉండడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ నగరాల్లో నమోదవుతున్న ఏక్యూఐ స్థాయిలు ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి. పారిశ్రామిక కాలుష్యం వల్ల రాజస్థాన్‌లోని బివాడిలో 300 నుంచి 400 మధ్య ఏక్యూఐ నమోదు అవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే శీతాకాలంలో ఏక్యూఐ 400 నుంచి 500 వరకు చేరుకుంటున్నది. వాహనాల పొగ, నిర్మాణ ధూళి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పొగమంచు ఆ నగర గాలిని ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్, నోయిడా నగరాల్లో కూడా ఏక్యూఐ తరచూ 250 నుంచి 350 మధ్య ఉంటున్నది. హర్యానాలోని గురుగ్రామ్, ఫరీదాబాద్ నగరాల్లో వేగవంతమైన పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ కారణంగా ఏక్యూఐ 200 నుంచి 300 మధ్య కొనసాగుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నా.. పాలకులు తగినంత చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు.

ప్రపంచంలోనే అతి పురాతన పర్వత శ్రేణుల్లో ఒకటైన ఆరావళి పర్వతాలపై కేంద్ర నిర్ణయాలు, వాటిని సుప్రీం కోర్టు ఆమోదించడం ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైంది. ఆరావళి పర్వతాలు ఉత్తర భారతానికి ఊపిరితిత్తుల్లాంటివి. ఈ కొండలు రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో వాతావరణ సమతుల్యను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయి తే గనుల తవ్వకాలు, నిర్మాణ ప్రాజెక్టుల పేరిట ఈ ప్రాంతంలో జరుగుతున్న మార్పులు పర్యావరణ వేత్తలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణానికి జరుగుతున్న హానిని గుర్తించిన ప్రజలు రాజస్థాన్‌లోని జైపూర్, ఉదయ్ పూర్, హర్యానాలోని గురుగ్రామ్‌లో శాం తియుత నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా జెన్ జీ (యువత) బయటకు వచ్చి నిరసనలు తెలపడమే కాకుండా ‘సేవ్ ఆరావళి’ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ నిరసన తెలుపుతున్నది.

వాయుకాలుష్యం దేశవ్యాప్తంగా మహమ్మారిలా విస్తరిస్తున్నది. శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు, పిల్లల్లో అస్తమ కేసులు పెరుగుతున్నాయి. నగరాల్లో పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎన్నికల రాజకీయాల్లో పెద్ద అంశాలుగా మారడం లేదు. రోడ్లు, వంతెనలు, పరిశ్రమల అభివృద్ధి గురించి పెద్ద హామీలు వినిపిస్తున్నాయే కానీ.. ఆ అభివృద్ధి వల్ల వచ్చే కాలుష్యాన్ని ఎలా నియంత్రిస్తామన్న స్పష్టమైన ప్రణాళికలు కనిపించడం లేదు. రైతు, ఉద్యోగం, కులం, మతం వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుండగా.. పర్యావరణం ప్రభావం చూపే అంశంగా రాజకీయ నేతలు భావించడం లేదు.

ఎంత మందికి రుణమాఫీ చేస్తాం? ఎన్ని ఉచిత పథకాలు ఇస్తాం? ఏ కులానికి ఎంత రిజర్వేషన్ కల్పిస్తాం? అనే అంశాలపై ఉన్న శ్రద్ధ, ‘మీ పిల్లలకు స్వచ్ఛమైన గాలిని, కలుషితం లేని నీటిని అందిస్తాం’ అనే అంశాలు రాజకీయ పార్టీలకు, నాయకులకు కనిపించడంలేదు. అంతేకాకుండా పారిశ్రామికవేత్తల విరాళాలపై నడిచే రాజకీయ వ్యవస్థ.. పర్యావరణ చట్టాలను కఠినతరం చేయడానికి వెనకాడుతున్నది. ప్రజల డిమాండ్లలో మార్పు వస్తేనే.. రాజకీయ పార్టీల ప్రాధాన్యతల్లో మార్పు వస్తుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణ జరిగి.. భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది. ఓటర్లు ప్రశ్నిస్తేనే రాజకీయాలు మారుతాయి. అయితే ఆ మార్పు ఆలస్యమైతే దాని మూల్యం దేశం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే అభివృద్ధి, పర్యావరణం రెండూ పరస్పర విరుద్ధమైనవి కావని రాజకీయ వ్యవస్థ గ్రహించాల్సిన అవసరముంది.