
పపంచంలో నాలుగో పెద్ద ఖండమైన దక్షిణ అమెరికాలోని 12 సార్వభౌమత్వ దేశాలలో అత్యధిక భూ విస్తీర్ణతగల దేశాల్లో వెనిజులా ఆరో స్థానం ఆక్రమించింది. భౌగోళిక, సాంస్కృతిక, భాషా వారసత్వ విశిష్టతలు కలిగి, అపారమైన ఖనిజ నిక్షేపాలతో, సహజ వనరులతో చ మురు క్షేత్రాలతో, జీవవైవిధ్య సౌందర్యంతో అలరాడే వెనిజులా ‘ల్యాండ్ ఆఫ్ వరల్ బ్యూటీస్’గా ప్రఖ్యాతి గాంచింది. లాటిన్ దేశాల్లో వెనిజులాకు ఎంతో ప్రాముఖ్యత గలదు. ప్రస్తుత వెనిజులా జనాభా 29 నుండి 30 కోట్ల వరకు ఉండవచ్చు. వెనిజులా ప్రపంచంలో 303 బిలియన్ల బ్యారెల్స్ తో అతి పెద్ద నిరూపిత ముడిచమురు నిల్వలున్న దేశంగా నిర్ధారించబడింది. ఆ తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా,ఇరాన్ తదితర దేశాలున్నాయి. అమెరికా,రష్యా,సౌదీ అరేబియా కెనడా, చైనా, ఇరాన్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు చమురు ఉత్పత్తుల్లో ప్రధాన భాగస్వామ్యం వహిస్తున్నాయి. చమురు లేనిదే పూట గడవని పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో చమురు కోసం యుద్ధాలు జరిగే రోజులు ఏర్పడుతున్నాయి. వర్తమాన ప్రపంచంలో చమురు చుట్టూనే రాజకీయ,వాణిజ్య సంబంధాలు పరిభ్రమిస్తున్నాయి.
ప్రస్తుతం ‘వెనిజులా‘ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగు తున్నది. దీనికి కారణం అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసల్వ్’ వేలాది మంది కమెండోల పర్యవేక్షణ లో,క్యూబా ఏజెంట్ల గస్తీలో అత్యంత శతృదుర్భేద్యమైన రక్షణ వలయాన్ని అమెరికా చేధించి, వెనిజులా అధ్యక్షుడైన నికోలస్ మదురోను చుట్టుముట్టి, చేతులకు సంకెళ్ళు బిగించి, ‘నార్కో టెర్రరిస్టు‘గా అభియోగం మోపి న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరు పరిచి,బోనులో నిలబెట్టి, భయంకరమైన నేరస్థులకు, డ్రగ్స్ స్మగ్లర్లకు, నరహంతకులకు నిలయమైన కారాగారంలో బంధించడం ప్రపం చ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఒక సార్వభౌమత్వ దేశం లోకి మరొక దేశం ఎవరి అనుమతి లేకుండా, ప్రవేశించడమే కాకుండా వెనిజులాను తమ వలస రాజ్యంగా భావించడం, వెనిజులా లోని చమురును తామే అమ్ముతామని ప్రకటించడం అగ్ర దేశ అపరిమిత అహంకార ధోరణికి దర్పణం పడుతున్నది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇప్పటివరకు ఉపాధ్యక్షురాలిగా ఉన్న డెల్సీ రోడ్రిగ్జ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ట్రంప్ తెంపరి తనం ప్రపంచాన్ని అరాచకం వైపు నెట్టింది. రానున్న రోజుల్లో చైనా కూడా అమెరికా బాటలోనే నడిచి తైవాన్‌పై దాడి చేసే అవకాశముంది. ఇప్పటికే ఉరిమురిమి చూస్తున్న ఉత్తర కొరియా, ఇజ్రాయిల్ దేశాలు కూడా బలహీన దేశాలపై దాడి చేసే అవకాశాలున్నాయి.
అమెరికాకు వ్యతిరేకంగా పెట్రో డాలర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం గా సౌదీ,చైనా,వెనిజులా దేశాలు ఇప్పటికే చర్యలకు ఉపక్రమించాయి. అమెరికా డాలర్ కు వ్యతిరేకంగా యువాన్,రూబుల్ వంటి మిత్ర దేశాల కరెన్సీని ప్రోత్సహించి,డాలర్ ను ఉపసంహరించుకోవడమే వెనిజులాపై ట్రంప్ కోపాగ్నికి కారణమైనదనే కథనాలు వెలువడుతున్నాయి. గత సంవత్సరం ఒకానొక సందర్భంలో దమ్ముంటే పట్టుకో… నీ కోసమే ఎదురుచూస్తా నంటూ..ట్రంప్ ను పిరికి పందగా అభివర్ణించిన నికోలస్ మదురో వ్యాఖ్యలు కూడా ట్రంప్ అహాన్ని దెబ్బతీసాయని,ఈ కారణంగానే మదురో పై ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్‘ కు దారితీసినట్టు విశ్లేషకుల అభిప్రాయం.
వెనిజులాలోని ఖనిజ సంపదను,చమురు నిల్వలను కొల్లగొట్టడానికే ట్రంప్ వెనిజులాపై దాడికి తెగబడినట్టు కొంతమంది అభిప్రాయం.ఏది ఏమైనప్పటికీ అమెరికా అధ్యక్షుని చర్య ప్రపంచంలోని అనేక దేశాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన మాట వాస్తవం. ట్రంప్ అవివేకం,అహంకారం వలన అమెరికా ప్రతిష్ట మంటగలిసింది. అంతర్జాతీయ చట్టాలకు విలువ లేకుండా పోయింది. గతంలో సద్ధాం హుస్సేన్,గడాఫీ లాంటి వారిని అంతమొందించిన చరిత్ర మరవక ముందే డోనాల్ ట్రంప్ తిరిగి అదే చరిత్రను పునరావృతం చేస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
నికోలస్ మదురో అమెరికా కు పట్టుబడడం తో కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది బాధ్యత గల వ్యక్తులు ఇది తమ దేశ సార్వభౌమత్వానికి వాటిల్లిన విఘాతం గా భావించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పై ఆధార పడ్డ కొన్ని దేశాలు ట్రంప్ చర్యలను సమర్ధిస్తుండగా, మెజారిటీ ప్రపంచం ముక్తకంఠంతో అమెరికా సామ్రాజ్యవాద,సాయుధ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నది.వెనిజులాలో ప్రజలు కడు పేదరికంతో అలమటిస్తూ ఆహారం లేక ఔషధాలు లేక గత పదేళ్ళలో సుమారు 80 లక్షల ప్రజలు దేశం వదలి పోయారు. 2 కోట్ల మంది అత్యంత దుర్భర జీవితం గడుపుతున్నారు.ఉచిత పథకాలు,విపరీతమైన వ్యయం తో పాటు హ్యూగో చావెజ్ అనాలోచిత నిర్ణయాలు,విధానాలు, పరిపాలనా పరమైన తప్పిదాలు ప్రజల ఆర్ధిక స్థితిగతులను దారి తప్పించాయి. చావెజ్ వారసుడిగా అధికార పగ్గాలు చేపట్టిన మదురో కూడా ప్రజలను అభివృద్ధికి దూరం చేసి,ఆర్ధిక అరాచకానికి బాట వేసాడు. వెనిజులా మాదిరిగా కాకుండా నార్వే,సౌదీలు వైవిధ్యభరితమైన ఆర్ధిక విధానాలను పాటించాయి. చమురును మాత్రమే ఆదాయ వనరుగా భావించిన వెనిజులా ఆర్థికంగా అధః పాతాళానికి దిగజారింది. ఏది ఏమైనప్పటికీ వెనిజులా లో అమెరికా పెత్తనం పోవాలి. వెనిజులా సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలి. అంతర్జాతీయ చట్టాలకున్న విలువను పునః ప్రతిష్టించాలి.
సుంకవల్లి సత్తిరాజు
97049 03463