Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని, అన్ని రకాలుగా వారికి అండగా ఉంటామని సిఎం రేవంత్‌రెడ్డి హామీనిచ్చారు. దివ్యాంగులకు మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్ఫూర్తి అని సిఎం రేవంత్ గుర్తు చేశారు. ఆయనకు వైకల్యం ఉందన్న ఆలోచన ఆయన ఎప్పటికీ రానివ్వలేదన్నారు. ఆయన సక్సెస్‌ను దివ్యాంగులు స్ఫూర్తిగా తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రజాభవన్‌లో బాలభరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్ పథకాలను సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికే కేటాయిస్తున్నామన్నారు. దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారా ఒలంపిక్స్‌లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని సిఎం రేవంత్ తెలిపారు.

వచ్చే కేబినెట్ సమావేశంలో ట్రాన్స్ జెండర్ల నిర్ణయాలు

ట్రాన్స్‌జెండర్లకు కూడా సమాజంలో ఆదరణ తక్కువగా ఉంటుందని వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్‌లలో ట్రాన్స్ జెండర్లను కోఆప్షన్ కింద నామినేట్ చేస్తామని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.ఒక ట్రాన్స్ జెండర్‌ను కార్పొరేటర్‌గా నామినేట్ చేస్తే వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుందని, వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోన్నట్లు ఆయన చెప్పారు.

తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే

జీతంలో 10 శాతం కట్

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతినెలా జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10 శాతం వారి తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులోను బడ్జెట్ సమావేశాల్లో బిల్లు తెస్తామాన్నారు. వయోవృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ‘ప్రణామ్ పేరుతో డే కేర్’ సెంటర్లను ఏర్పాటు చేస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే తమ విధానమని ఆయన తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నామన్నారు.

ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉంది

ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉందని, ఎవరూ ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామన్నారు. రెండేళ్ల తమ పాలనలో అన్ని సమస్యలు పరిష్కరించామని, అద్భుతాలు చేశామని తాను చెప్పడం లేదన్నారు. కానీ, ఉన్న సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. ఒకప్పుడు ఈ ప్రజాభవన్‌లోకి అడుగు పెట్టేందుకు నాలుగు గంటలు ఎదురు చూసినా గద్దర్ వెళ్లలేక పోయారని ఆయన ఆరోపించారు. కానీ, కొద్దిమంది శ్రీమంతులు, బడా వ్యక్తులకే అప్పట్లో ఎంట్రీ ఉండేదని, ఇప్పుడు సామాన్యులు కూడా ఇక్కడకు రావొచ్చని, ధర్మగంట కొట్టవచ్చని ఆయన తెలిపారు.