
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహంతో సంబంధం ఉన్న రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-పిఏసి)పై ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాడులను ఏకపక్షంగా చూడలేం. అలాగే కొనసాగుతున్న ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు, లేదా ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాల ప్రకటనల్లో హఠాత్ పెరుగుదల సాధారణ పరిపాలనా చర్యగా పరిగణించలేము. మొత్తంమీద ఈ చర్యలు లోతైన, ఇబ్బంది కరమైన నమూనాను సూచిస్తున్నాయి. కేంద్రంలోని అధికార పార్టీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను బలహీనపరచేందుకు, ఆ ప్రభుత్వాలని అస్థిరపరచేందుకు, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు కేంద్రం అధికారాన్ని ఓ క్రమపద్ధతిలో వాడడమే దీని వెనుక ప్రధాన కారణం..
భారత రాజ్యాంగం ఫ్రేమ్ వర్క్ పోటీతత్వం, ఫెడరిలిజం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సంస్థల తటస్థతపై ఆదారపడి ఉంటుంది. నిజానికి సీబీఐ, ఈడి వంటి కేంద్ర సంస్థలు దేశంలో ఆర్థిక నేరాలు, అవినీతి దర్యాప్తుకోసం ఏర్పడినవి. తప్ప రాజకీయ సాధనాలుగా పనిచేసేందుకు కాదు. అయినా, గత దశాబ్ది కాలంగా వాటి పనితీరు పక్కతోవ పట్టినట్లు కన్పిస్తోంది. ప్రతిపక్ష పార్టీలతో సంబంధం ఉన్న నాయకులు, సంస్థలే లక్ష్యంగా చేసుకుని దాడులు, అరెస్ట్ లు దీర్ఘకాలిక దర్యాప్తు వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. అంతేకాదు. అధికార పార్టీతో జతకట్టిన నాయకులకు సంబంధించిన కేసుల విషయంలో రాజకీయ విధేయ సంస్థలుగా మారి, తరచు వాటి ఆవశ్యకతను కోల్పోతున్నాయి. ఫలితంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడమే కాక, చట్టపరంగా సాగే పాలనపై నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వాటి రాజకీయ అనుబంధం ప్రమాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది.
పశ్చిమ బెంగాల్‌లో ఐ- ప్యాక్‌పై ఈడి చర్య చాలా దారుణం. ఇది వ్యక్తిగత నాయకులపై కాకుండా ప్రతిపక్ష ప్రచారానికి సంబంధించిన సంస్థాగత, వ్యూహాత్మక కేంద్రాన్ని దెబ్బతీస్తుంది. ఎన్నికలతో సంబంధంలేని మనీల్యాండరింగ్ దర్యాప్తులో ఈ దాడులు జరిగాయని ఈడీ చెబుతున్నా.. ఎన్నికలు జరగనున్న వేళ.. దాడులు జరపడం ఆందోళనలను లేవనెత్తుతోంది. ఎలక్టోరల్ డెమోక్రసీ అంటే పోలింగ్ రోజున ఓట్లు వేయడమే కాదు. ప్రచార సమయంలో న్యాయమైన పరిస్థితుల కల్పన కూడా. దర్యాప్తు సంస్థల జోక్యంతో సంబంధం లేకుండా పార్టీలు ప్రచారం నిర్వహించుకోవడం, కమ్యూనికేట్ చేయడం, జన సమీకరణకు వీలు కల్పించడం కూడా అందులోనే చేరుతుంది.
ఇది కేవలం పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కాలేదు. మహారాష్ట్ర నుంచి జార్ఖండ్ వరకూ, ఢిల్లీ నుంచి తమిళనాడు వరకూ ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు.. గవర్నర్లు, దర్యాప్తు ఏజెన్సీలు, ఆర్థిక నియంత్రణ రూపంలో కేంద్రం జోక్యం.. వంటి పలు విధాలా దాడిని ఎదుర్కొంటున్నాయి. తరచు రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు క్రమపద్ధతిలో వీటిని వాడు కుంటున్నట్లు కన్పిస్తున్నది. కొన్ని సందర్భాల్లో, ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజా తీర్పువల్ల కాక, చట్టపరమైన ఒత్తిడులు, బలవంతపు ఫిరాయింపుల ద్వారా కూలిపోయాయి. ఇలాంటివి కొన్ని సమయాల్లో సాంకేతిక పరంగా రాజ్యాంగబద్ధంగా కన్పించవచ్చు, కానీ ప్రజాస్వా మ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయి.
అనర్హులైన, నకిలీ, ఓటర్లను తొలగించే లక్ష్యంతో ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ అనేక రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలకు కారణంగా మా రింది. ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఓటర్ల జాబితా సవరణలు అవసరమే. అయినా వాటిని రాజకీయం చేయడం వల్ల పెద్దఎత్తున బహిష్కరణకు దారితీయవచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, పట్టణ పేద జనాభా, మైనారిటీలు, తగిన డాక్యుమెంట్లు అందే సౌకర్యాలు తక్కువగా ఉన్న వర్గాలలో ఆందోళన రేకెత్తవచ్చు.అలాంటి పౌరులకు సంక్షేమం, గృహనిర్మాణం, ప్రాథమిక గుర్తింపు సేవలు నిరాకరిస్తున్న దేశంలో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబడుతున్నాయనే ఆరోపణలను తేలికగా తోసిపుచ్చలేము. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యం, రాజకీయంగా సున్నితమైన ప్రదేశాలలో అలాంటి కసరత్తు చేపట్టినప్పుడు అవి ఎన్నికల సమగ్రతకు సాధనాలుగా కాక, నిశ్శబ్దంగా ఓటు హక్కు తొలగింపు సాధనాలుగా మారే ప్రమాదం ఉంది.
తాజాగా సవరించిన జనాభా లెక్కల ఆధారంగా చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన మరింత ఇబ్బందికరం. దేశవ్యాప్తంగా సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకే సూత్రప్రాయంగా ఉద్దేశించినా, ఆచరణలో విసృ్తత రాజకీయ ఏకాభిప్రాయం లేకుండా నిర్వహిస్తే, అది ప్రాంతాల మధ్య రాజకీయ అధికార పంపిణీపై తీవ్ర ప్రభావం చూపగలదు. జనాభా నియంత్రణ విధానాలను విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ప్రాతినిధ్యం కోల్పోయే ప్రమాదం ఉంది. మరి కొన్ని రాష్ట్రాలు లాభపడవచ్చు. ఇది దశాబ్దాలుగా సాగుతున్న జాతీయ రాజకీయాలను వక్రికరించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, తూర్పు ప్రాంతంలో, ఈశాన్యంలో చిన్న రాష్ట్రాలకు జనాభా పరంగా రాజకీయంగా శిక్ష పడుతుందనే భయాన్ని పెంచుతోంది. ఇది యూనియన్ ను కలిపిన ఫెడరల్ ఒప్పందాన్ని బలహీనపరుస్తుంది.
సంక్షేమ పథకాల వ్యూహాత్మక సమయం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది. ఎన్నికల ముందు పెద్దఎత్తున పథకాల పంపిణీ- నగదు బదిలీలు, ఉచిత రేషన్లు, ఇళ్ళ పంపిణీ, మౌలిక సదుపాయాల ప్రకటనలు, పాలనకు, ప్రచారానికి మధ్య గల రేఖను మసక బారుస్తుంది. సంక్షేమం ఏ ప్రభుత్వానికి అయినా చట్టబద్ధమైన విధి. అయినా, దానిని ఎన్నికల సాధనంగా ఉపయోగించడం నైతిక, చట్టపరమైన ప్రశ్నలకు రేకెత్తిస్తుంది. కేంద్రంలో అధికారపార్టీ రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేయడానికి జాతీయ ఖజానా, కేంద్ర ప్రచార యంత్రాంగం, పాలనా పరమైన నెట్ వర్క్ ను వాడుకోగలిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు సంస్థాగతంగా ప్రతికూలపరిస్థితి, ఆర్థిక అసమానతలను కూడా ఎదుర్కొంటున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో భారత ఎన్నికల కమిషన్ పాత్ర కీలకంగా మారనున్నది. ఎన్నికల విశ్వసనీయత, రిఫరీ నిష్పాక్షికత, అధికారం కలిగిన సంస్థ అనే భావనపై ఎక్కువ ఆదారపడి ఉంటుంది. అయితే ఎన్నికల కమిషన్ అధికార పార్టీ నాయకులపై చర్య తీసుకోవడంలో జాప్యం చేస్తున్నదనే ఆరోపణ రావడం, ఎన్నికల నియమావళి అమలులో మార్పులు, అధికార పార్టీ నాయకులపై తీవ్రమైన ఫిర్యాదులు వచ్చినా, ప్రతిస్పందన లేకపోవడం వల్ల సిఈసి పై ప్రజల నమ్మకం తగ్గింది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని చెప్పినా, స్పష్టమైన, పారదర్శకత, తటస్థ వైఖరి కూడా స్పష్టం కావాలి.
ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నది వ్యక్తిగత పార్టీల ఎన్నికల అదృష్టం మాత్రమే కాదు. రిపబ్లిక్ మౌలిక ప్రాథమిక సూత్రాలు కూడా. ప్రజాస్వామ్యంఅంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కాదు. సజావుగా ఎన్నికలు ఎలా నిర్వహించబడతాయి. సంస్థలు ఎలా పనిచేస్తాయి. చట్టం ద్వారా అధికారం ఎలా పరమితం చేయబడుతుందని అన్నవీ ముఖ్యం. దర్యాప్తు సంస్థలు, పాలనా ప్రక్రియ,సంక్షేమ విధానాలు, రాజకీయ యంత్రాంగం ఒక రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి కలిసివచ్చినప్పుడు, పార్టీలు, ప్రభుత్వం మధ్య వ్యత్యాసం తొలగిపోతుంది. ప్రరంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్య తిరోగమనానికి ఒక ముఖ్యలక్షణం ఇదే. అవినీతి నిర్మూలనకు బలమైన చర్యలు, పాలనా సంస్కరణలు అవసరమని అధికారపార్టీ మద్దతు దారులు కోరవచ్చు. ప్రతిపక్ష నాయకులు జవాబుదారీతనం నుంచి తప్పించు కోవడానికే రాజకీయ బాధితులను ప్రేరేపిస్తున్నారని వాదించవచ్చు. అయితే, జవాబుదారీ తనం సార్వత్రికమైనది. రాజకీయ నెట్ వర్క్ నుంచి దూరంగా ఉండాలి. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్న వారి మాదిరి అదే పరిశీలనకు గురవుతున్నారా. రాజకీయాలతో సంబంధం లేకుండా దర్యాప్తు సంస్థలు అత్యవసరపరిస్థితిలో చర్యలు చేపడుతున్నాయా. అన్నదానిపై సంస్థాగత సమగ్రతకు నిజమైన పరీక్ష ఉంటుంది.
భారతదేశ ప్రజాస్వాన్య వ్యవస్థ చరిత్రాత్మకంగా బలమైన ప్రాంతీయపార్టీలు, స్వతంత్ర పత్రికా యంత్రాంగం, బలమైన సంస్థాగత నియంత్రణలపై ఆదారపడి ఉంది. స్వల్పకాలిక రాజకీయ ఆధిపత్యం కోసం ఈ వ్యవస్థలను అణగదొక్కడం ద్వారా ఎన్నికల విజయాలను సాధించవచ్చు. కానీ అది గణతంత్రం నైతిక, రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థకు దీర్ఘకాలికంగా నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. నాయబద్ధత క్రమంగా క్షీణిస్తే, ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు. ప్రజలు ఓటు వేసినా, ప్రత్యామ్నాయాలు బలహీన పడినప్పుడు వారి ఛాయిస్ పరిమితం అవుతుంది.
ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. ఇందుకు నిబద్ధత ఎంతయినా అవసరం. అధికారంలో ఉన్నవారు మరింత సంయమనం ప్రదర్శించాలి. సంస్థలకు నిజమైన స్వయం ప్రతిపత్తి కల్పించాలి. పారదర్శకంగా నియామక ప్రక్రియలు చేపట్టాలు. ఎన్నికల కాలంలో ఏజెన్సీ చర్యలపై బలమైన న్యాయ పర్యవేక్షణ అవసరం. స్వల్పకాలిక ప్రయోజనంతో నిమిత్తం లేకుండా, రాజకీయ పార్టీలు, పౌరసమాజం, మీడియా సంస్థలు సంస్థాగత నిబంధనలను స్థిరంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు అర్థవంతంగా ఉండాలంటే, ఈ ప్రక్రియ ఫలితం పవిత్రంగా ఉండాలి. లేకుంటే, ప్రభుత్వాలు అన్యాయంగా చేతులు మారే ప్రమాదమే కాదు. ప్రజలు, పౌరులు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కోల్పోయే ప్రమాదం మరింత ఉంది.
గీతార్థ పాఠక్