Reading Time: 2 minutes

మన తెలంగాణ/హైదరాబాద్ : పోలవరం – నల్లమల సాగర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి నిజస్వరూపం, ద్రోహ బుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో పాలమూరు ప్రాజెక్టుపై రైతులతో ఎపి రిట్ వేయించి స్టే తెచ్చుకుందని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ విచారణార్హత లేని పిటిషన్ వేసి రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను ఎపికి ధారాదత్తం చేస్తూ రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సుప్రీంకోర్టులో పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకున్న అంశంపై సోమవారం మాజీ మంత్రి హరీష్‌రావు వీడియో విడుదల చేశారు. రిట్ ఉపసంహరించుకుని సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అంటోందని, దీంతో పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఎపికి గడువు ఇచ్చినట్లైందని పేర్కొన్నారు.

ఏళ్లు గడిచినా అది ముగియని కథే

ఎపి, తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథే అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ఈలోగా ఎపి ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకుపోతుందని మండిపడ్డారు.ఈ మాత్రం విషయం ప్రభుత్వ న్యాయవాది, ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా..? అని ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా..? అంటూ ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండుగ వేళ చంద్రబాబుకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్.. సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పోలవరం- నల్లమల సాగర్ విషయంలో ముందు నుంచీ రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఎపికి పూర్తిగా సహకరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. పోను పోను అనుకుంటూనే రేవంత్ రెడ్డి ఆనాడు ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లారని.. ఎజెండాలో లేదంటూనే బనకచర్లపై చర్చ జరిపారని అన్నారు.

పెట్టబోను అంటూనే సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశారని పేర్కొన్నారు. వేయను అంటూనే కమిటీ వేసి ఎపి జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేశారని ఆరోపణలు చేశారు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపారని మండిపడ్డారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్‌కు మద్దతు ప్రకటించారంటూ సిఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము నిలదీస్తే బనకచర్లను అడ్డుకుంటామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని నమ్మ బలికిన రేవంత్ రెడ్డి, నేడు కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశారని హరీష్‌రావు ఆరోపించారు. పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు కూర్చొని చర్చించుకుందామన్న రేవంత్ రెడ్డి మాటల అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గురుదక్షిణ కోసం రేవంత్ రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తుంటే తెలంగాణను సాధించిన బిఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సిఎం దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తామని హరీష్‌రావు వెల్లడించారు.