
మన తెలంగాణ/హైదరాబాద్: పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ ప్రాజెక్టుపై దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసిం ది. సోమవారం సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసిం ఘ్వీ వాదనలు వినిపించారు. పోలవరం ప్రాజెక్టును నల్లమలసాగర్‌తో లింక్ చేయడం వల్ల తెలంగాణ రా ష్ట్రానికి నష్టమని, గోదావరి నీటి కేటాయింపులు ఉ ల్లంఘన అవుతున్నాయని ఆయన కోర్టులో తన వాద న వినిపించారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొనసాగించలేమని తెలిపింది. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాలు కూడా ముడిపడి ఉన్నాయని వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని న్యాయస్థానం పేర్కొంది. ఈ పిటీషన్‌ను విచారిస్తే గోదావరి నది పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి వస్తాయని ధర్మాసనం తెలిపింది. దీనిలో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వాదనలు కూడా వినాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిస్థితిలో ఇతర ప్రత్యామ్నాయ మార్గాలైన మధ్యవర్తిత్వం, లేదా సివిల్ సూట్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ ఈ పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. దీంతో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టుకు న్యాయవాది సింఘ్వీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సివిల్ సూట్ వేస్తామని ఆయన కోర్టుకు తెలియజేశారు.
సిజేఐ సూచన మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాం: మంత్రి ఉత్తమ్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 131, సివిల్ సూట్ రూపంలో రావాలని సుప్రీంకోర్టు సీజేఐ సూచించడంతో పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సమగ్ర వివరాలతో సివిల్ సూట్ వేస్తామని అన్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీలో ఉన్న మంత్రి ఉత్తమ్ కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ వాదనలను బలంగా వినిపించామని అన్నారు. గత సోమవారం జరిగిన వాదనలకు అదనంగా ఈ సోమవారం మరికొన్ని వాదనలు వినిపించామని చెప్పారు. కేటాయింపుల కంటే ఎక్కువ నీళ్లు వాడొద్దనేది తమ పిటీషన్‌లో ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి ఒప్పందాల ఉల్లంఘనలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చామని, పనులు నిలిపివేత ఉత్తర్వులను అమలు చేయడం లేదని కూడా కోర్టుకు వివరించినట్లు -ఉత్తమ్ వెల్లడించారు.
ఏపీకి కేటాయించిన 484.5 టీఎంసీల కంటే ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ, గోదావరి, కృష్ణా బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళుతోందని ధర్మాసనానికి తెలిపామని చెప్పారు. అనుమతులు లేకుండా పోలవరం నుంచి బనకచర్ల లేదా నల్లమల సాగర్‌కు లింక్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ తమ ప్రభుత్వం ఇటీవల సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. తక్షణమే ఈ పనులు ఆపేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టడం చట్టబద్ధం కాదని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రీ ఫీజిబులిటీ రిపోర్టులను కేంద్ర ప్రభుత్వం పరిశీలించటం ఎంతమాత్రం సమంజసం కాదని తమ పిటీషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశామని ఉత్తమ్ వెల్లడించారు.