
బెంగళూరులో ఒక బైక్ టాక్సీ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు బుక్కయ్యాడు. ప్రయాణం పొడవునా ఆమెను ఇబ్బంది పెట్టినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే…ఓ 25 ఏళ్ల యువతి బీటీఎం లేఅవుట్ నుండి ఇందిరానగర్ వెళ్లడానికి బైక్ టాక్సీ బుక్ చేసుకుంది. అయితే ప్రయాణ సమయంలో డ్రైవర్ ఆమెను పదేపదే అసభ్యంగా తాకుతూ వేధించాడు. బాధితురాలు అతడిని హెచ్చరించినప్పటికీ, అతడు వినిపించుకోకుండా అదే పని చేస్తూనే ఉన్నాడు.
దీంతో ఆ యువతి ధైర్యంగా ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని మహమ్మద్ ఖిజర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కొత్త చట్టం (BNS) సెక్షన్ 75 కింద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
బెంగళూరులో ఇలాంటి ఘటనలు పదేపదే జరగడం మహిళా ప్రయాణికులను భయపెడుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో రాపిడో ఆటో డ్రైవర్ ఓ కాలేజీ అమ్మాయిని వేధించినందుకు కేసు నమోదైంది.
అదే ఏడాది నవంబర్‌లో విల్సన్ గార్డెన్ దగ్గర మరో బైక్ టాక్సీ డ్రైవర్ అమ్మాయి కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దింతో ఆ అమ్మాయి ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
ALSO READ : పాపం చికెన్ లవర్స్.. తెలంగాణలో మరికొన్ని గంటల్లో చికెన్ షాపులు బంద్..
బైక్ టాక్సీలు లేదా క్యాబ్‌లలో ప్రయాణించేటప్పుడు మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలని లేదా యాప్‌లోని ‘సేఫ్టీ బటన్’ వాడాలని చెబుతున్నారు.