Reading Time: < 1 minute

బట్టలు ఆరేస్తుండగా..విద్యుత్ షాక్ తో తల్లి మృతి..అనాథలైన ముగ్గురు పిల్లలు

Caption of Image.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామంలో తీరని విషాదం నెలకొంది. మార్చి 31న జరిగిన ఒక దురదృష్టకర విద్యుత్ ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ ఉదయం సమయంలో ఉతికిన బట్టలు ఆరవేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యారు. కరెంట్ షాక్ బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్లముందే తల్లి ప్రాణాలు విడవడం చూసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అయితే, ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఆ ఇంట్లోని ముగ్గురు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. గతంలోనే తండ్రిని కోల్పోయిన ఆ ముగ్గురు పిల్లలకు (ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు), ఇప్పుడు తల్లి కూడా దూరమవడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడింది. అమ్మానాన్న ఇద్దరూ లేని ఆ పిల్లల రోదనలు చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఈ ప్రమాదంతో కొమ్మెర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనాథలైన ఆ ముగ్గురు చిన్నారులను ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి అండగా నిలవాలని గ్రామస్థులు , స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.