Reading Time: < 1 minute

నలంద (బీహార్): బీహార్‌లోని నలంద జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శీతల మాతను దర్శించుకునేందుకు ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన దీప్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘ్రా గ్రామంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే దీప్‌నగర్ స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులందరూ మహిళలేనని.. స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. “బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను,” అని ఆయన పేర్కొన్నారు. “మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియాను ప్రధాని మోడీ  ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున అందించనున్నారు.

ఇక, తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. అలాగే, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మరో రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది.ఈ ఘటనపై విచారణ జరపాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.