
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పవర్ జనరేషన్ నిలిపివేయాలని నిబంధన ఉందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీశైలం ప్రాజెక్టు లో 64 శాతం తెలంగాణకు వాటా ఉందని, నీటిని అక్రమంగా తరలించవద్దని కోర్టు ఆదేశాలున్నాయని, దీనికి భిన్నంగా అక్రమంగా ఎపి ప్రభుత్వం నీటిని వాడుతోందని విమర్శించారు. తాగడానికి నీళ్లు లేకుండా చేస్తారా? అని జూపల్లి ప్రశ్నించారు. ఖమ్మం, నల్గొండ, పాలమూరు జిల్లాల రైతులకు హక్కులు కాలరాస్తే ఊరుకోమని, తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే వాడాలని సూచించారు. ఎపి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నామని, తాము ధర్నా చేస్తాం అనే వరకు నీళ్లు దోచుకుందని మండిపడ్డారు. ఎపి ఇప్పుడు ఆపిందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.