Reading Time: 2 minutes

ట్రేడర్లకు షాక్: పెరిగిన F&O ట్యాక్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. ఇక లాభాలు కష్టమేనా?

Caption of Image.

భారత స్టాక్ మార్కెట్ ట్రేడర్లకు ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త షాక్ తగలనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం రాకతో పాటు డెరివేటివ్స్(F&O) మార్కెట్లో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంపు అమల్లోకి రానుంది. బడ్జెట్ 2026లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ నిర్ణయం మార్కెట్లో మితిమీరిన ట్రేడింగ్‌ను తగ్గించే లక్ష్యంతో తీసుకురాబడింది. అయితే ఈ పెంపు సామాన్య, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడర్ల జేబులకు పెద్ద చిల్లు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై ట్రాన్సాక్షన్ టాక్స్ 0.02% నుండి 0.05%కి పెరిగింది. అంటే ఏకంగా 150 శాతం పెంపు అన్నమాట. ఇక ఆప్షన్స్ ట్రేడింగ్ విషయానికి వస్తే.. ప్రీమియంపై ట్రాన్సాక్షన్ టాక్స్ 0.1% నుండి 0.15%కి పెరిగింది. ఈ మార్పులు వినడానికి చిన్నవిగా అనిపించినా.. ట్రేడింగ్ లావాదేవీల ఖర్చును ఇవి భారీగా పెంచుతాయి. ఉదాహరణకు.. నిఫ్టీ ఫ్యూచర్స్‌లో ఒక లాట్ ట్రేడ్ చేస్తే పాత పద్ధతిలో బ్రేక్-ఈవెన్ సాధించడానికి 6 పాయింట్లు వస్తే సరిపోయేది, కానీ ఏప్రిల్ 1 నుంచి నష్టం రాకుండా కాపాడుకోవాలంటే 13 పాయింట్లు అవసరం అంటున్నారు ట్రేడర్లు.

ఇదే ప్రభావం బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఫ్యూచర్స్‌పై కూడా పడనుంది. బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్ -ఈవెన్ పాయింట్లు 10.4 నుండి 26కి, సెన్సెక్స్‌లో 15 నుండి 37.5 పాయింట్లకు పెరుగుతాయి. దీని అర్థం ఏమిటంటే.. ట్రేడర్లు తాము పెట్టిన ఖర్చును వెనక్కి తెచ్చుకోవడానికే ఇప్పుడు డబుల్ కష్టపడాల్సి ఉంటుంది. చిన్న చిన్న లాభాల కోసం చేసే స్కాల్పింగ్ ట్రేడింగ్‌కు ఇది పెద్ద దెబ్బే. కేవలం 2-3 పాయింట్ల లాభంతో బయటకు వచ్చే ట్రేడర్లకు ఇకపై మిగిలేది సున్నా. పైగా తప్పుడు ఎంట్రీలు తీసుకునే వారికి పన్ను రూపంలో పెనాల్టీ పడినట్లవుతుంది టాక్స్ రూపంలో.

ALSO READ : బెంగళూరులో బైక్ టాక్సీ డ్రైవర్ బాగోతం

ఈ ట్యాక్స్ పెంపు వల్ల మార్కెట్ వాల్యూమ్స్ 20 నుంచి 30 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు, అల్గో ట్రేడింగ్ చేసే సంస్థలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి రావొచ్చు. లావాదేవీల ఖర్చు పెరగడం వల్ల మార్కెట్లో లిక్విడిటీ తగ్గే ప్రమాదం కూడా ఉంది. ఏప్రిల్ 1 నుంచి ట్రేడర్లు కేవలం పక్కాగా లాభం వచ్చే ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేదంటే లాభం వచ్చినా అది పన్నులకే సరిపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.