Reading Time: < 1 minute

కాకతీయ యూనివర్సిటీ బడ్జెట్ రూ.331.9 కోట్లు

Caption of Image.

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ 2026-–27 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.331.99 కోట్ల అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. గతేడాది రూ.480.04 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించగా, ఈసారి దాదాపు 148.05 కోట్లు తగ్గింది. ఈ మేరకు వీసీ ప్రొ.కె.ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన కేయూలో సోమవారం జరిగిన 41వ అకడమిక్ సెనెట్ మీటింగ్​లో రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం, అకడమిక్ సెనెట్ సభ్యుల సమక్షంలో వర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్, ఆర్ట్స్ విభాగాల డీన్ బి.సురేశ్ లాల్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.205.47 కోట్లు వస్తాయని అంచనా వేశారు. 

అకడమిక్, ట్యూషన్ ఫీజుల రూపంలో రూ.8.3 కోట్లు, అంతర్గత వనరుల నుంచి రూ.41.41 కోట్లు, ఇతర పద్దుల ద్వారా రూ.21.56 కోట్లు, ఎగ్జామినేషన్స్ రూ.49.64 కోట్లు వస్తాయని, దాదాపు రూ.2.16 కోట్ల లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకు రూ.169.96 కోట్లు, వర్సిటీ నిర్వహణకు రూ.10.34 కోట్లు, పరీక్షల నిర్వహణకు రూ.54.88 కోట్లు, అకడమిక్ ప్రోగ్రామ్స్ కు రూ.13.68 కోట్లు, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.97.44 కోట్లు, ఏరియర్స్ రూ.8.4 కోట్లు, ఇతర అవసరాలకు రూ.1.75 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వర్సిటీ వీసీ కె.ప్రతాప్​రెడ్డి మాట్లాడుతూ సమష్టి కృషితో యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. 

విద్యార్థులను ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సిలబస్ రూపకల్పన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు. విద్యార్థులు మానసిక స్థితికి అండగా ఉండేందుకు ‘చేతన’ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం బడ్జెట్ పై అకడమిక్ సభ్యులు ప్రొ.విద్యావతి, ఆర్.సాయన్న, ప్రొ.బి.వెంకటరత్నం, డా.అంపశయ్య నవీన్, ఈసీ మెంబర్ పుల్లూరు సుధాకర్ తదితరులు అభిప్రాయాలను వెల్లడించారు. మీటింగ్​లో ఈసీ మెంబర్స్ డాక్టర్ బి.రమ, డాక్టర్ ఎన్.సుదర్శన్, డాక్టర్ చిర్ర రాజు, ప్రొ.ఎం.నవీన్, డాక్టర్ బి.సుకుమారి తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.