Reading Time: < 1 minute

హైదరాబాద్: ఐపిఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించారు. రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో 127 పరుగులకే చెన్నై జట్టు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లు జోప్రా ఆర్చర్, నంద్రే బర్గర్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీసి సిఎస్‌కె నడ్డి విరిచారు. రవీంద్ర జడేజా ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఫస్ట్ ఓవర్ లోనే రెండో బంతికి ఎల్‌బి డబ్ల్యు రూపంలో సర్ఫరాజ్ ఖాన్ ఔట్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు శివమ్ దూబే దిగాడు. జడేజా విసిరిన మూడో బంతిని దూబే సిక్స్‌గా మలిచాడు. అదే ఓవర్‌లో చివరి బంతి ఆఫ్ సైడ్‌లో దూరంగా వేయడంతో దూబే సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు. బౌండరీ వద్ద రవి బిష్ణోయ్ బంతిని ఒడిసిపట్టుకున్నాడు. వెంటనే రవీంద్ర జడేజా తుపాకీ పేల్చినట్టుగా సైగా చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత సీజన్ వరకు శివమ్ దూబే, రవీంద్ర జడేజా సిఎస్‌కె జట్టులో ఆడారు.

ఇప్పుడు ఇద్దరు వేర్వేరు జట్లలో ఉన్నారు. తాజాగా గన్‌షాట్ సెలబ్రేషన్‌పై రవీంద్ర జడేజా స్పందించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో జట్టులో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేవారమని, అతడు ఎలా ఆలోచిస్తాడో తనకు బాగా తెలుసునని చెప్పారు. అతడు స్పిన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్లు కొట్టగలడని, అప్పటికే రాగానే తన బౌలింగ్‌లో ఒక సిక్స్ బాదాడని, ఆఫ్ స్టంప్‌కు దూరంగా బంతి వేయడంతో భారీ షాట్ ఆడాడని, బౌండరీ దగ్గర క్యాచ్ రూపంలో ఔట్ కావడంతోనే తాను గన్ షాట్ సెలబ్రేషన్స్ చేసుకున్నానని జడేజా వివరణ ఇచ్చాడు. ఇందులో మరో ఉద్దేశం ఏమీ లేదని, గౌహతి పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని ప్రశంసించారు. ఎక్కువ టర్నింగ్ ఉండడంతో బౌలింగ్‌లో అస్వాదించానని చెప్పారు. సరైన ప్రాంతంలో బంతిని విసిరితే వికెట్లు పడుతాయని రవీంద్ర తెలియజేశారు.