
సంక్రాంతి సంబరాల్లో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీలో భాగంగా సన్న ధాన్యం పండించిన రైతు లకు ప్రకటించిన క్వింటాకు రూ. 500 బోనస్ బకాయిల చెల్లింపుకు పౌర సరఫరాల శాఖ తాజాగా రూ.500 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్‌లో సన్నాలు పండించి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ప్రతి రైతుకు క్వింటాకు రూ. 500 అదనంగా చెల్లించాలని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అధికారులను ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ ఈ ప్రక్రియను వేగవం తం చేసింది. ఈ ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు సన్న ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం మొత్తం రూ. 1,429 కోట్ల రూపాయలను విడు దల చేయడం గమనార్హం. సాధారణ మద్దతు ధరతో పాటు ఈ బోనస్ సొమ్ము కూడా తోడవ్వడంతో రైతులకు ఆర్థికంగా భారీ ఊరట లభిస్తోంది.
కేవలం సన్న రకం సాగును ప్రోత్సహించడమే కాకుండా, వినియోగదారులకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భారీ వ్యయాన్ని భరిస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల వివరాలను నమోదు చేసి, నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే ఈ బోనస్ మొత్తాన్ని జమ చేస్తున్నారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శ కంగా ఈ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే చాలా మంది రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు జమ కాగా ఒకటి లేదా రెండు రోజుల్లో మిగతా రైతుల ఖాతాల్లోకి ఈ నిధులు కూడా జమ అయ్యే అవకాశం ఉంది. పండుగ వేళ చేతికి డబ్బులు అందనుండటంతో పాటు యాసంగి పంట సాగుకు రైతు భరోసా డబ్బుల పంపిణీ ఆలస్యమ వుతున్న నేపథ్యంలో సన్నల బోనస్ తమకు ఎంతో ప్రయోజనకరం కానుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.