
న్యూఢిల్లీ: 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం (మార్చి 31) లియాండర్ పేస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పేస్ కాషాయ పార్టీలో చేరారు. ఆయన బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
బీజేపీలో చేరిన తర్వాత లియాండర్ పేస్ మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్‌లకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేశానికి, దేశ యువతకు సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఈ అవకాశం లభించినందుకు రుణపడి ఉంటాను. ‘ఖేలో ఇండియా’ ఒక అద్భుతమైన కార్యక్రమం. ‘ఖేలో ఇండియా’ పట్ల, యువత పట్ల ప్రధానమంత్రి ఏ విధమైన అంకితభావం, ఏకాగ్రతను ప్రదర్శించారో, అదే అంకితభావంతో యువతపై దృష్టి సారించడమే నా సంకల్పం” అని ఆయన అన్నారు.