Reading Time: < 1 minute

పాట్నా: బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని శీతలా మాతా ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు చనిపోయారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మాఘ్రా గ్రామంలో చైత్రమాసం చివరి వారం కావడంతో శీతలా మాతా ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక్కసారిగా తోపులాట జరగడంతో ఎనిమిది భక్తులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది మంది మృతులు మహిళలుగా గుర్తించారు. బిహార్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ప్రతి మంగళవారం ఇక్కడ రద్దీ ఉంటుందని, తాము దర్శనం కోసం వచ్చామని పాట్నా నుంచి వచ్చిన ఓ భక్తురాలు తెలిపింది. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందని వివరించింది.