Reading Time: < 1 minute
Sheetlaashtami Temple Stampede: చైత్రమాసం చివరి మంగళవారం.. ఆలయంలో తొక్కిసలాట! 8 మంది భక్తులు మృతి

నలంద, మార్చి 31: బీహార్‌లోని నలందలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. మృతులంతా మహిళలే కావడం విశేషం. మరోవైపు పదుల సంఖ్యలో భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నలంద జిల్లాలోని బీహార్ షరీఫ్‌కు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఘ్రా గ్రామంలోని శీతలాష్టమి ఆలయం వద్ద ఈ తొక్కిసలాట జరిగింది.

ఈ రోజు చైత్ర మాసంలోని చివరి మంగళవారం కావడంతో ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా భక్తులు ఆలయంలోకి ప్రవేశించడంలో పరిస్థితి అదుపు తప్పింది. అకస్మాత్తుగా తొక్కిసలాట జరగడంతో గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళలు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సర్దుమనిగేలా చేశారు. గాయపడిన వారిని హుటాహుటీన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతోంది.

తొక్కిసలాట సమయంలో ఎటు చూసినా భక్తులు భయంతో హాహాకారాలు చేశారు. ప్రమాదం అనంతరం పదుల సంఖ్యలో మహిళలు నేలపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ ఫొటోల్లో ఓ వ్యక్తి ఒక మహిళ తల వద్ద వంగి ఆమెకు సీపీఆర్ (CPR) ఇస్తూ కనిపించాడు. మరో మహిళ స్పృహ కోల్పోయిన మహిళ ముఖాన్ని నిమురుతూ ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి ముఖంపై నీళ్ళు చల్లుతూ కనిపించింది. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.