
వాళ్లిద్దరూ భార్యభర్తలు.. పెళ్లయ్యి తొమ్మిది సంవత్సరాలు. పెళ్లికి ముందు ప్రేమించుకున్నారు.. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. భార్యభర్తలు ఇద్దరూ సాఫ్ట్ వేర్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. ఏదో చిన్నాచితక కంపెనీ కాదు.. IBM కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పెద్ద పెద్ద జీతంతో పని చేస్తున్నవాళ్లే.. బెంగళూరు సిటీలో ఉద్యోగం.. ఏమైందో ఏమో.. ఫస్ట్ భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు.. భర్త మరణాన్ని చూసిన భార్య.. వాళ్లు ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలోనే.. 17వ అంతస్తు నుంచి దూకేసింది. భార్యభర్తలు ఇద్దరూ చనిపోయారు. వీళ్లిద్దరూ తెలంగాణవాసులే.. అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఈ విషాద ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులో 2026 మార్చి 31న జరిగిన వరుస ఆత్మహత్యల ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి, షాజియా తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందు లివిన్ రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట పెళ్లి చేసుకుని బెంగళూరులో సెటిలయ్యారు. ఉద్యోగ రీత్యా ఇద్దరు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్స్ కావడంతో బెంగళూరులోని కోతనూరులోని ఒక అపార్టుమెంటులో ఉంటున్నారు. ఐబీఎం కంపెనీలో జాబ్ చేస్తున్న వీరి మధ్య కుటుంబ కలహాలు పెరిగి పెద్దయినట్లు చెబుతున్నారు.
సోమవారం (మార్చి 31) భాను చందర్ రెడ్డి ఇంట్లో తలుపు వేసుకుని ఎంత పిలిచినా తెరవక పోవడంతో సెక్యూరిటీకి సమాచారం ఇచ్చింది భార్య షాజియా. డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. ఆ ఘటన చూసిన వెంటనే భార్య షాజియా షాక్ కు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల తర్వాత.. షాజియా బయటకు పరుగెత్తి అదే నివాస భవనంలోని 17వ అంతస్తు నుండి దూకేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
ALSO READ : ఇరాన్ పూర్తిగా లొంగే వరకు యుద్ధం ఆపొద్దు
మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ పోలీసులు రెండు వేర్వేరు అసహజ మరణ కేసులను నమోదు చేశారు. ఆరోగ్య సమస్యలు, సంబంధాలలోని ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక, తదుపరి దర్యాప్తు తర్వాతే కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు.