Reading Time: < 1 minute

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు… తీవ్రంగా దెబ్బతిన్న మామిడి, మొక్కజొన్న పంటలు

Caption of Image.

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం ( మార్చి 31 ) తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి చాలా జిల్లాలో పంటలు నేలకొరిగాయి. పెద్దపల్లి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న , మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ప్రతి ఏడాది పంట చేతికి వచ్చే  సమయంలో ఇలాంటి ఈదురు గాలులు, అకాల వర్షాలు కురవడం వల్ల భారీ నష్టాలు ఎదుర్కొంటున్నమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మామిడి రైతులు. 

అకాల వర్షాలతో పంట నష్టపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెడుతోందని అంటున్నారు రైతులు.ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షానికి సుమారు 30 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కురిసిన అకాల వర్షానికి వరి, మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోవడంతో రైతులు విలపిస్తున్నారు. అకాల వర్షానికి చేతికొచ్చిన వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయని అన్నారు. నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు రైతులు.

జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా మామిడి, మొక్కజొన్న, నువ్వుల పంటలు నేలరాలాయి. జిల్లా వ్యాప్తంగా వంద ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు సమాచారం. అకాల వర్షానికి పంట దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాదంటూ లబోదికోమంటున్నారు రైతులు.పంట చేతికి వచ్చే సమయానికి సమయానికి ఈదురు గలులతో వల్ల భారీగా నష్టపోయామంటున్నారు రైతులు. 

జిల్లావ్యాప్తంగా సుమారు మూడు వేల ఎకరాల్లో వరి, 3000 ఎకరాల్లో మొక్కజొన్న నేల రాలాగా, సుమారు 4000 ఎకరాల్లో మామిడి కాయలు రాలినట్లు సమాచారం. ప్రభుత్వాలు మారిన రైతుల పరిస్థితి మాత్రం మారడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.

©️ VIL Media Pvt Ltd.