Reading Time: 2 minutes
Tamil Nadu: ఎన్నికల వేళ ఊహించని ఘటన.. ముఖ్యమంత్రి కారులో ఫ్లయింగ్ స్క్వాడ్‌ తనిఖీలు!

తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హీటెక్కాయి. వివిధ రాజకీయ పార్టీలు, నేతల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం నిర్వహిస్తున్న నేతలపై ఎన్నికల అధికారుల నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఈరోజు మంగళవారం (మార్చి 31) తంజావూరు సమీపంలో డీఎంకే నాయకుడు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కారును ఎన్నికల అధికారులు అడ్డుకున్నారు. సీఎం స్టాలిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌లు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు 23వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి, అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 30 సోమవారం నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, టీవీకే నాయకుడు విజయ్, నామ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్ తదితరులు సోమవారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, డీఎంకే నాయకుడు స్టాలిన్ కొలత్తూరులో రోడ్ షోతో తన ప్రచారాన్ని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ తొలి దశలో తన సొంత ఊరైన తిరువారూరు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఈ రోజు మంగళవారం సాయంత్రం 5 గంటలకు తిరువారూరు దక్షిణ రథ వీధిలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరు కానున్నారు. తిరువారూర్ నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి పూండి కలైవానన్‌కు, తిరుత్తురైపూండి నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి మారిముత్తుకు, నన్నిలం నియోజకవర్గం నుంచి ఎస్టీపీఐ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ముబారక్‌కు, మన్నార్గుడి నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థి టి.ఆర్.పి. రాజాకు మద్దతుగా ముఖ్యమంత్రి ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు..

తిరువారూరులో ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఈ ఉదయం చెన్నై నుంచి తిరుచికి విమానంలో వెళ్లారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో తిరువారూరుకు బయలుదేరారు. ఆ సమయంలో, తంజావూరు సమీపంలోని సాలియ మంగళం వద్ద ఆయన ప్రచార వాహనాన్ని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌ అడ్డగించి సోదాలు నిర్వహించాయి. అధికారులు ముఖ్యమంత్రి కూర్చున్న కారు ముందు భాగాన్ని సోదా చేశారు. వెనుక డోరును కూడా తెరిచి సోదా నిర్వహించారు. ఈ సోదాలో మహిళా పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వాహనంలో ఏమీ దొరకకపోవడంతో, సోదా అనంతరం ఆయన వాహనాన్ని ముందుకు వెళ్లడానికి అనుమతించారు.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..