
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కృష్ణానదిపై కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టకుండా కాంగ్రెస్ ఉసురుపోసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ కింద కృష్టా జలాలు ఆంధ్రాకు తరలిస్తున్నాడని, తాత్కాలిక కేటాయింపులకు కూడా కట్టుబడి ఎపి, రేవంత్ సర్కార్ ఉన్నారని విమర్శించారు. కృష్ణా నీళ్లను అడ్డగోలుగా ఎపి వాడుకుంటున్నా చోద్యం చేస్తుందని, నల్లొండ జిల్లాలో నోటికాడికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. తెలంగాణకు తక్కువ వాడుకుని ఆంధ్రాకు గురుదక్షిణ చెల్లిస్తారా? అని ప్రశ్నించారు. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నీళ్లు, రైతాంగ సమస్యలపై మాట్లాడరని, పోలవరం బనకచర్లతో 114 టిఎంసిల నీటిని యధేచ్ఛగా తీసుకుపోతున్నారని ధ్వజమెత్తారు. ఎపిని నిలువరించకుండా, కెఆర్ఎంబికి లేఖ రాయకుండా..తమాషా చేసి ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నారని నిరింజన్ రెడ్డి నిలదీశారు.
ఎస్ఎల్ బిసి టన్నెల్ కూలిపోయి 8 మంది ప్రాణాలు పోతే వెలికితీయలేకపోతున్నారని, పదిశాతం మిగిలిపోయిన పాలమూరు- రంగారెడ్డి పనులు పూర్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేస్తే 12 లక్షల ఎకరాలకు సమృద్ధిగా పండుతాయని, ప్రజల ప్రయోజనాలు ముఖ్యమనుకుంటే రేవంత్ ఇంటి ముందు ధర్నా చేయాలని బిఆర్ఎస్ నేతలకు సూచించారు. పాలమూరు- రంగారెడ్డి మిగులు పనులు పూర్తి చేయించడం చాతకాదని, అపెక్స్ కౌన్సిల్ వద్దకు నీటి తరలింపును కట్టడి చేసింది లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చే నీళ్లివ్వకుండా, పంటలు ఎండిపోతున్న దశలో స్పందిస్తే ఎలా? ప్రశ్నించారు. 2 పంపుల మరమ్మతుకు రూ.10 కోట్లు పెట్టలేకపోతున్నారని, కల్వకుర్తి- ఎత్తిపోతల పథకం కింద అదనంగా మరో 1600 క్యూసెక్కుల నీళ్లు అదనంగా వచ్చేవని తెలియజేశారు. మాజీ సిఎం కెసిఆర్ అత్యద్భుతంగా పాలమూరు- రంగారెడ్డి, బీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులతో..ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచారని నిరంజన్ రెడ్డి కొనియాడారు.