Reading Time: < 1 minute

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

Caption of Image.

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు పంపింది. జనవరి 29వ తేదీన సమ్మక్క సారక్క జాతర దగ్గర జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో ఏప్రిల్ 4వ తేదీన హైదరాబాద్ నగరంలో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. 

BNSS సెక్షన్ 35(3) కింద విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. హుజురాబాద్ పోలీస్ స్టేషన్ కేసు నంబర్ 30/2026 నమోదైంది. సమ్మక్క సారక్క జాతర సమయంలో రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారనేది కౌశిక్ రెడ్డిపై ఉన్న ఆరోపణ. ప్రజలకు అసౌకర్యం కలిగించారని, పోలీసుల విధులకు అడ్డంకి కలిగించారని, పోలీస్ అధికారులపై అవమానకర వ్యాఖ్యలు చేశాడని కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు. 

శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినట్టు కేసు నమోదైంది. ఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏప్రిల్ 4న ఉదయం 11:30కు విచారణకు హాజరు కావాలని పాడి కౌశిక్ రెడ్డికి నోటీసుల్లో స్పష్టం చేశారు. గుర్తింపు పత్రాలు, సంబంధిత డాక్యుమెంట్లు తీసుకురావాలని.. విచారణకు సహకరించాల్సిందిగా కోరారు. సాక్ష్యాలను చెడగొట్టవద్దని హెచ్చరించారు. నోటీసును పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

©️ VIL Media Pvt Ltd.