
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించింది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె కారిడార్లను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ కారిడార్లపై రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. లొకేషన్ సర్వే, డీపీఆర్ తయారీకి అధికారులు సిద్దమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కేంద్రం బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులకు భూమిని సేకరించనుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి నిర్మించనున్న బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ప్యూచర్ సిటీలో 500 ఎకరాలు
బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టు కోసం భారత్ ప్యూచర్ సిటీ పరిధిలో 500 ఎకరాలు కేటాయించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శంషాబాద్ సమీపంలో ఈ భూమిని కేటాయించనున్నట్లు చెప్పారు. ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని పనులపై సచివాలయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రోడ్ల పనులపై చర్చించారు. ప్యూచర్ సిటీ-అమరావతి-బంద్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే, మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లైన్ల విస్తరణ వంటి పనులపై కీలక సూచనలు చేశారు. త్వరలోనే ఈ పనులను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. 2028 నాటికి తెలంగాణలోని రోడ్లను అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు.
3.5 గంటల్లోనే చెన్నై, బెంగళూరుకు..
ఇక బుల్లెట్ ట్రైన్ల కారిడార్ల నిర్మాణం పూర్తయితే బుల్లెట్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టనుంది. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు తక్కువ సమయంలోనే చేరుకోవచ్చు. ప్రస్తుతం 12 నుంచి 15 గంటల సమయం పడుతుంది. అయితే బుల్లెట్ రైళ్ల ద్వారా 3.5 గంటల్లోనే చేరుకోవచ్చు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు కేవలం 180 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తున్నాయి. వీటి ద్వారా ప్రయాణ సమయం కాస్త తగ్గగా.. బుల్లెట్ రైళ్లతో మరింత తగ్గనుంది.