
కరూర్ తొక్కిసలాట సంఘటపై సిబిఐ విచారణకు సోమవారం ఉదయం 11.29 గంటలకు భారీ భద్రత మధ్య తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధ్యక్షుడు, నటుడు విజయ్ హాజరయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ సాగింది. ఇంకా మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావలసి ఉన్నందున మళ్లీ మంగళవారం విచారణకు రావాలని సిబిఐ తెలియజేయగా పొంగల్ అయినందున మరో రోజు వస్తానని విజయ్ వివరించారు. దీనికి సిబిఐ అంగీకరించి తాజా తేదీ తెలియజేస్తామని చెప్పారు. సాయంత్రం 6.15 గంటలకు ఆయన సిబిఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. తమిళనాడు లోని కరూర్‌లో గత ఏడాది సెప్టెంబరు 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. టివికె పార్టీ కార్యకర్తలను కూడా సిబిఐ ప్రశ్నించింది. తాము వేసిన ప్రశ్నలకు విజయ్ నుంచి వచ్చిన స్పందనపై సిబిఐ తరువాత ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో తమిళనాడు మాజీ ఎడిజి (లా అండ్ ఆర్డర్ ) ఎస్ డేవిడ్‌సన్ దేవాశీర్వాదంను కూడా సిబిఐ ప్రశ్నించింది. భారీగా మద్దతుదారులు తరలివస్తారని భావించి డిల్లీ పోలీసులు , సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ దళాలు సిబిఐ ఆఫీస్ ముందు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.