
హైదరాబాద్: ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. యుసుఫ్‌గూడాలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. మంత్రి పొన్నం, డిజిపి శివధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ థీమ్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. చలానాలు వేయకుండానే నియంత్రణ చర్యలు చేపట్టాలి. చలానా మొత్తం వాహన యజమాని నుంచి వసూలు చేసేలా చూడాలి. తప్పని పరిస్థితుల్లో చలానా వేయాలి.. డిస్కౌంట్లు ఇవ్వాలి. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కూడా కేసులు పెట్టాలి. డిజి లేదా అదనపు డిజి స్థాయి అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ వ్యవస్థ ఉండాలి. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రభుత్వం అజెండాగా తీసుకోబోతోంది’’ అని అన్నారు.