
నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. యువతిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లి హత్య చేసిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బోరబండకు చెందిన జహీర్ జ్యూస్ సెంటర్‌లో పనిచేస్తుండగా, ఖనీజ్ ఫాతిమా బంజారాహిల్స్‌లోని ఓ పబ్బులో పని చేసింది. పబ్‌లో పనిచేస్తున్న సమయంలోనే యువతితో జహీర్‌కు పరిచయం ఏర్పడింది. జహీర్ తరచూ పబ్‌కు వెళ్తుండడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. కొంత కాలం తర్వాత యువతి పబ్ ఉద్యోగం మానివేసి బోరబండలోని ఊర్వశీ బార్‌లో ఉద్యోగంలో చేరింది. కొత్త ఉద్యోగంలో చేరినప్పటి నుంచి యువతి, జహీర్‌తో మాట్లాడడం తగ్గించింది.
యువకుడు ఫోన్ చేసినా స్పందించడం మానివేసింది. యువతి తనను పట్టించుకోవడం లేదని, ఉద్దేశపూర్వకంగా దూరం పెడుతోందని భావించి కోపం పెంచుకున్నాడు. యువతి తనతో మాట్లాడకపోవడానికి కారణం తెలుసుకోవాలని పిలిచినట్లు తెలిసింది. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో హత్య చేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న వెంటనే బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. హత్యకు పాల్పడిన యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మాట్లాడదామని పిలిచి…
మాట్లాడుకుందామని జహీర్ యువతిని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి వెనుక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పదునైన ఆయుధంతో యువతిని హత్య చేసి అక్కడి నుంచి బోరబండలోని బస్తీకి వెళ్లిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువతి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచిన కుమార్తెను కోల్పోవడం తల్లిదండ్రులను తీవ్రంగా కలిచివేసింది. నిందితుడికి కఠినశిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.