Reading Time: < 1 minute

న్యూఢిల్లీ : టీవీకే అధినేత విజయ్ నటించిన “జననాయగణ్ ” సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయకుండా మద్రాస్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆ సినిమా నిర్మాత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జననాయగణ్ సినిమాకు వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వుపై జనవరి 9న మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. దీంతో ఆ సినిమా రాజకీయ వివాదంగా మారింది. గత శుక్రవారం హైకోర్టు డివిజన్ బెంచ్ జారీ చేసిన స్టే ఉత్తర్వును సవాలు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా వచ్చే ముందు తుది చిత్రంగా జననాయగణ్ సినిమాకు భారీ ఎత్తున ప్రచారం జరిగింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న విడుదల కావలసి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతో చిక్కులు ఎదురయ్యాయి. ఈ సినిమాను రివ్యూ కమిటీ పరిశీలించాలని ఫిలిం బోర్టు ఆదేశాలను పక్కనపెట్టి జస్టిస్ పిటి ఆషా సిబిఎఫ్‌సికి సెన్సార్ సర్టిఫికెట్ తక్షణం జారీ చేయాలని ఉత్తర్వు జారీ చేసిన తరువాత డివిజన్ బెంచ్ దానిపై స్టే విధించింది.