
తమిళనాడులో తీవ్ర విషాదం మిగిల్చిన కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, నటుడు విజయ్ సిబిఐ విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి జనవరి 12న సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని విజయ్ కి సిబీఐ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో విచారణ కోసం సోమవారం విజయ్, ఢిల్లీలోని సిబిఐ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు ఆరు గంటలపాటు సిబిఐ ఆయనను ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.ఇప్పటికే తమిళగ వెట్రి కజగం (టీవీకే) కు చెందిన పలువురు ఆఫీసు బేరర్లను సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో సిబిఐ.. చార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది.
కాగా, తమిళనాడు లోని కరూర్ లో 2025 సెప్టెంబర్ 27న విజయ్ ప్రసంగించిన రాజకీయ సమావేశంలో జరిగిన తొక్కసలాటకు సంబంధించి సిబిఐ ఆధారాలను సేకరిస్తోంది. ఈ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. కరూర్ దుర్ఘటనపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని టివికే దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించి, ఈ కేసును సిబీఐకి అప్పగించింది.