
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను దిగ్గజ నిర్మాత అల్లు అరవింద్ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘సినిమా చూసి చాలా ఎగ్జయిట్ అయ్యాను. బాస్ చింపేశాడు. బాస్ ఈజ్ బాస. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి సినిమాలు చూసినప్పుడు కలిగిన అనుభూతి, ఆనందం మళ్లీ ఇన్నాళ్లకు కలిగింది. పాత చిరంజీవిని చూసే అవకాశం దొరికింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. వింటేజ్ చిరును తీసుకొచ్చారు. చిరంజీవి-వెంకటేశ్ కాంబినేషన్ అదిరిపోయింది. జనాలకు ఇది పైసా వసూల్ మూవీ’’ అని అరవింద్ ప్రశంసించారు.